గురుదాస్‌పూర్‌ కాంగ్రెస్.. కేరళ ముస్లిం లీగ్ కైవసం

15 Oct, 2017 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఆదివారం వెలువడిన ఓ పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో ఘోర పరాభవం ఎదురయ్యింది. కేరళ వెంగర అసెంబ్లీ స్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్ పార్టీ నిలుపుకోగా,  గురుదాస్‌పూర్‌ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 

కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి స్వర్ణ్ సాలారియాపై లక్షా 93 వేల 219 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు స్వర్ణ్‌కు మంచి పోటీ ఇచ్చారనే తెలుస్తోంది. ఈ ఓటమితో ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ విజయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొంది. 

సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ శాతం (సుమారు 54 శాతం) పోలింగ్ నమోదు కావటం విశేషం.

కేరళలోనూ వాడిన కమలం...

ఇక కేరళ వెంగర అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంలో మాత్రం ఊహించిన విధంగానే తీర్పు వచ్చింది.  వెంగర అసెంబ్లీ నియోజక వర్గంలో ముస్లిం లీగ్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కేఎన్‌ఏ ఖాదర్(యూడీఎఫ్‌ మద్దతుదారు)‌.. ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి పీపీ బషీర్‌పై(ఎల్‌డీఎఫ్‌ మద్దతుదారు) 23,000 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ది సోషలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ మూడు స్థానంతో సరిపెట్టుకోగా, ఆరెస్సెస్‌ అల్లర్ల కారణంతో ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయి బీజేపీ చివరకు నాలుగో స్థానానికే పరిమితం అయ్యింది. విజయంపై ఖాదర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్‌ అభ్యర్థి కున్హాలీ కుట్టి 38,000 ఓట్ల తేడాతో విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఆ మెజార్టీ 15000పైగా పడిపోవటం గమనార్హం. కున్హాలీ లోక్‌సభ(మలప్పురం నియోజకవర్గం)కు వెళ్లటంతో ఖాళీ అయిన వెంగర అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 11 ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు