మండలి చైర్మన్‌గా గుత్తా

12 Sep, 2019 02:55 IST|Sakshi

ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన డిప్యూటీ చైర్మన్‌

అభినందనలు తెలిపినమంత్రులు, శాసన మండలి సభ్యులు

సభ హుందాతనం పెంచేలా పనిచేద్దామని గుత్తా పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం శాసన మండలి సమావేశం సందర్భంగా నూతన చైర్మన్‌ గా ఎన్నికైన గుత్తాను శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తల సాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి తదితరులు.. చైర్మన్‌ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. గుత్తాకు మంత్రులతో పాటు అన్ని పారీ్టల శాసన మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం మండలి సమావేశం ప్రారంభమయ్యాక చైర్మన్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌.. నూతన చైర్మన్‌గా గుత్తా ఎన్నికైనట్లు ప్రకటించారు. 
 
హుందాగా ప్రవర్తిద్దాం: గుత్తా
శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. సంకుచిత విమర్శలు, పరస్పర ఆరోపణల జోలికి పోకుండా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి మీద కీలక చర్చలు జరగాలని.. వర్తమాన పరిస్థితుల్లో్ల ఇది ఎంతో కీలకమన్నారు. తనను అత్యున్నత పదవికి ఎంపిక చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు.

అభినందనల వెల్లువ..
మండలి చైర్మన్‌గా ఎన్నికైన సుఖేందర్‌రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి మండలి చైర్మన్‌ దాకా నాలుగు దశాబ్దాల గుత్తా రాజకీయ ప్రస్తానాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు గుత్తాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్‌ విప్‌ బోడ కుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు కర్నె ప్రభాకర్, భానుప్రకాశ్‌రావు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు, కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి, ఉపాధ్యా య ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, నర్సింరెడ్డి, రఘోత్తంరెడ్డి చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.

14కు మండలి వాయిదా...
మండలి చైర్మన్‌ ఎన్నికపై ప్రకటన, సభ్యుల అభినందన ప్రసంగాలు పూర్తయిన తర్వాత.. సభను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వ సమాధానం కూడా ఉంటుందన్నారు. 16 నుంచి 21 వరకు మండలి సమావేశాలను వాయిదా వేసి, తిరిగి 22న నిర్వహిస్తామని బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం తరఫున సభ ముందుంచారు.

మండలి సైడ్‌లైట్స్‌...
►గుత్తాను ఉద్దేశిస్తూ.. మీరు ఆజానుబాహులు, మీరు కూర్చోవడం ద్వారా మండలి చైర్మన్‌ కురీ్చకి హుందాతనం వచి్చందని హరీశ్‌రావు వ్యాఖ్యానించగా.. అవును మీరిద్దరు ఆజానుబాహులు.. పొగుడుకోవాల్సిందే అని కడియం అన్నారు.

►తాను చిట్యాలలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసిన కాలంలో గుత్తాను తొలిసారి చూశానని కర్నె ప్రభాకర్‌ పేర్కొనగా.. ఏం ఉద్యోగం చేశావో చెప్పు అని ఎమ్మెల్సీ నారదాసు రెట్టించడంతో.. ప్రైవేటు డెయిరీలో ఉద్యోగం చేశానని కర్నె అన్నారు.

వార్డు సభ్యుడిగా..
జననం: 1954, ఫిబ్రవరి 02
జన్మస్థలం: నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం ఉరుమడ్ల
విద్యార్హత: బీఎస్సీ
పొలిటికల్‌ కెరీర్‌: ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981). ఠి చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ (1984). ఠి చిట్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ (1991). ఠి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌ చైర్మన్‌ (1992–99). ఠి నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ (1998). ఠి నల్లగొండ లోక్‌సభ సభ్యులు (13, 15, 16 లోక్‌సభలో). ఠి తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్‌ (2018–19).

మరిన్ని వార్తలు