ప్రజలు అబద్ధాలను నమ్మొద్దు: ప్రధాని మోదీ

22 Dec, 2019 14:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘నన్ను ద్వేషించండి, నా దిష్టిబొమ్మలు దగ్దం చేయండి. కానీ భారత్‌ను మాత్రం ద్వేషించకండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల ప్రచారం, ఆందోళనలను ఆయన దుయ్యబట్టారు. కావాలంటే తనను ద్వేషించాలని... అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో మోదీ ప్రసంగింస్తూ... సీఏఏ, ఎన్నార్సీ భారతీయ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన హామీ ఇచ్చారు. అయితే పౌరసత్వ సవరణ చట్టంతో కొత్తగా వచ్చే శరణార్ధులకు ఎలాంటి ప్రయోజనం లభించదని ప్రధాని అన్నారు.  ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నక్సల్స్‌.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...‘బిన్నత్వంలో ఏకత్వం...భారత్‌ విశేషం. 40లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపాం. మీ భూమిపై సంపూర్ణ హక్కు కల్పించాం. ఢిల్లీ సర్కార్‌ ప్రజలకు అబద్ధపు హామీలిచ్చింది. తాగునీటి సమస్య తీర్చాలన్న ధ్యాస ఢిల్లీ ప్రభుత్వానికి లేదు.  పౌరసత్వ చట్టంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంట్‌కు ధన్యవాదాలు చెప్పండి. ఢిల్లీలో అనధికార కాలనీలను మతాలను చూడకుండా రెగ్యులరైజ్‌ చేశాం. 

అబద్ధాలు ప్రచారం చేసేవాళ్లను నమ్మకండి. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. 8కోట్ల మందికి పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. అప్పుడు మతాలను చూశామా? ప్రతి ఒక్కరు ఉజ్వల యోజన పథకంతో లబ్ధి పొందుతున్నారు. జాతి, మతాలను చూడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. విధి నిర్వహణలో కర్తవ్యానికి కట్టుబడి ఉన్నవారిపై దాడులు చేయడం సరికాదని ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు