నోటి కాడ ఓటు గేమ్స్‌

11 Nov, 2018 01:16 IST|Sakshi

     టీఆర్‌ఎస్‌ దొడ్డు బియ్యం పాట.. కాంగ్రెస్‌ సన్న బియ్యం మాట

     పోటాపోటీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీలు

     ఆదాయ పరిమితికి మించి రేషన్‌ ఇస్తున్నామంటోన్న టీఆర్‌ఎస్‌

     7 కిలోల సన్నాలు, 9 రకాల సరుకులు ఇస్తామంటూ కాంగ్రెస్‌..

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న ‘బియ్యం’ అంశాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నాయి. రేషన్‌ కార్డుదారులకు  గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు కిలోల దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న ఘనత తమదేనని టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తుంటే.. మున్ముందు ఏడు కిలోల సన్నబియ్యం ఇచ్చి తీరుతామని, అంతేకాక గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాదిరి తొమ్మిది రకాల వంట సరుకులు పంపిణీ చేస్తామని, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు సిలిండర్లు సైతం ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రేషన్‌ లబ్ధిదారుల్లో ఆశలు రేపుతోంది. రెండు ప్రధాన పార్టీలు చెబుతున్న మాటలను ప్రజలు ఎంత మేర విశ్వసిస్తారు, ఏ పార్టీకి మద్దతు పలుకుతారనే అంశాలతో పాటు ఈ ఎన్నికల్లో ఏ ‘బియ్యం’ ఉడుకుతుంది?, ఏ బియ్యం ఎవరికి ఓట్లు వడ్డిస్తుంది?, ఏ బియ్యం.. పార్టీలకు విజయాన్ని వండి వార్చనుందనేది ఆసక్తికరంగా మారింది.

టీఆర్‌ఎస్‌ కడుపునిండా బువ్వ
రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో మొత్తంగా 85 లక్షల కుటుంబాలు ఉండగా, 2.72 కోట్ల మంది లబ్ధిదారులు రేషన్‌ బియ్యాన్ని పొందుతున్నారు. ప్రతీ కుటుంబానికి ఎలాంటి పరిమితి లేకుండా ప్రతీ వ్యక్తికి నెలకు 6 కిలోల బియ్యాన్ని కిలో రూపాయికే అందిస్తోంది. ఏటా 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని పేదలకు సరఫరా చేస్తోంది. దీనికోసం రూ.2,200 కోట్ల మేర సబ్సిడీ భారం భరిస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.5 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉంటేనే రేషన్‌ కార్డు పొందేందుకు అర్హులు కాగా, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు కుదించిన విషయాన్ని ప్రస్తావిస్తోంది.

ఇక కాంగ్రెస్‌ హయాంలో మూడున్నర ఎకరాల తరి భూమి ఉంటే సైతం పేదలుగా ప్రకటించలేదని, కానీ తమ ప్రభుత్వం ఏడున్నర ఎకరాల వరకు పరిమితిని మించి అందరికీ రేషన్‌ ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఉప ముఖ్యమంత్రులు మహబూబ్‌ అలి, కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌ తమ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో కుటుంబంలో నలుగురికే రేషన్‌ బియ్యం అందేదని, తమ ప్రభుత్వం మాత్రం కుటుంబంలో ఎందరున్నా పరిమితి లేకుండా 6 కిలోలు సరఫరా చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు హాస్టల్‌ విద్యార్థులకు బీపీటీ, సోనామసూరి వంటి సన్న రకాలతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామంటూ విద్యార్థుల తల్లిదండ్రులని ఆకర్షిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కల్పించే అంశాన్ని టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో చేర్చేలా కసరత్తు చేస్తోంది.

కాంగ్రెస్‌ సన్నబియ్యం, సిలిండర్‌
అత్యంత కీలకంగా మారిన బీపీఎల్‌ కుటుంబాల అంశాన్ని కాంగ్రెస్‌ సీరియస్‌గానే తీసుకుంటోంది. ఎన్నికల తీర్పును ప్రభావితం చేయగలిగే అంశం కావడంతో రేషన్‌కార్డులు, లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకుల సరఫరా అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. ముఖ్యంగా లబ్ధిదారులందరికీ నెలకు 7 కిలోల సన్నబియ్యం అందిస్తామని అంటోంది. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రేషన్‌ సరఫరా చేస్తామని హామీలు గుప్పిస్తోంది. ఒకవేళ సన్నబియ్యం సరఫరా చేస్తే ప్రభుత్వంపై ప్రస్తుతం పడే భారం రూ.2,200 కోట్లకు అదనంగా మరో రూ.1,200 కోట్లు ఉండవచ్చని చెబుతోంది.

సన్నబియ్యం అంశంపై సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, దానిపై ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. ఎన్నికల్లో ఈ అంశం బాగా కలిసొస్తుందని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్‌ దీనికి అదనంగా గతంలో అమలు చేసిన అమ్మ హస్తం అంశాన్ని తెరపైకి తెచ్చింది. అమ్మహస్తం ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారంపొడి, పసుపు వంటి సరుకులు సరఫరా చేస్తామని హామీ ఇస్తోంది. ఇదే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తోంది. దీనికి తోడు ప్రతి బీపీఎల్‌ కుటుంబానికి ఏటా ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై జరిపిన చర్చల్లో సిలిండర్ల సంఖ్యను 8 వరకు పెంచాలనే వినతులు రావడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. రేషన్‌ సరుకుల అంశాన్ని గ్రామాల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే డీలర్లను ఇందుకు ప్రచార సాధనంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్న కాంగ్రెస్‌ వారి కమీషన్‌ను రూ.70 నుంచి మరింత పెంచుతామని హామీనిస్తోంది.
- సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి

‘ఫ్లాష్‌’ ఐడియా
ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీఆర్‌ఎస్‌.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లే దారులు వెతుకుతోంది. ఆత్మీయ సమావేశాలు, సభలు, రోడ్‌ షో వంటి సంప్రదాయ ప్రచార పద్ధతులతో పాటు వినూత్న విధానాలకు వ్యూహ రచన చేస్తోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు.. ప్రచారం, నిధుల సేకరణకు షాపింగ్‌ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో ‘ఫ్లాష్‌ మాబ్‌‘ పేరిట నగరాలు, పట్టణాల్లో వీధి నాటకాల తరహా ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఇదే తరహా ప్రచార పద్ధతిని ఎన్నికల్లోనూ అనుసరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ‘పవన్‌ కాన్సెప్ట్‌‘ అనే సంస్థ ఢిల్లీకి చెందిన ‘నుక్కడ్‌ నాటక్‌‘ సహకారాన్ని తీసుకుంటోంది. మంత్రి హరీశ్‌ రావు సూచన మేరకు వీధి నాటకాల రూపకల్పనను మెదక్‌ అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మ భర్త దేవేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. స్థానిక కళాకారులతో ఏర్పాటైన ఫ్లాష్‌మ్యాబ్‌ బృందం.. ప్రస్తుతం మెదక్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన నుక్కడ్‌ నాటక్‌ దర్శకుల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ బృందం సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రదర్శనలు ప్రారంభించేలా షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి ఈ బృందం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రదర్శనలు ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లు దేవేందర్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
-కల్వల మల్లికార్జున్‌రెడ్డి 

మరిన్ని వార్తలు