ఒక్క ఫ్లైఓవర్‌ కట్టలేకపోయారు..

7 Apr, 2019 08:18 IST|Sakshi

సాక్షి, ఎలక‌్షన్‌ డెస్క్‌ :  ప్రజలకు ఏం అవసరమో పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుని.. ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకంతోనే వాటిని అమలు చేసిన మహానాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంతకన్నా మెరుగైన పాలన అందించే దృఢ సంకల్పమున్న యువనాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోయారు. వందలాది హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి, ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నేత రాష్ట్రానికి అవసరం. అలాంటి విజన్, ఇచ్చిన హామీల్ని అమలుచేసే విశ్వసనీయత ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయన పాలనను రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు’ అని సినీ నటుడు కృష్ణుడు (అల్లూరి కృష్ణంరాజు) అంటున్నారు. ఎన్నికల వేళ ‘సాక్షి’తో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. 

రాజన్న పాలన గురించి అప్పుడు అర్థమైంది 
పాదయాత్రలో పాల్గొన్నప్పుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అనేక సమస్యలు విన్నవించడం నేను ప్రత్యక్షంగా చూశాను. తమకు ప్రభుత్వం నుంచి పథకాల లబ్ధి అందడం లేదని వృద్ధులు, వికలాంగులు, మహిళలు చెప్తుంటే బాధనిపించింది. వైఎస్‌ హయాం అనంతరం ఇందిరమ్మ ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదని జగనన్న దృష్టికి తీసుకొచ్చేవారు.

డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ కాలేదని చాలామంది చెప్పుకుని బాధపడేవారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అందడంలేదని తల్లిదండ్రులు, విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకునేవారు. రాజన్న పాలన అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. వైఎస్సార్‌ హయాంలోని సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారు.  

మార్పు తప్పనిసరి 
వైఎస్‌ జగన్‌ జనంతో మమేకమై, వారి సమస్యలు వింటూ, వారిలో భరోసా నింపిన తీరు చూశాను. తాను సీఎం అయ్యాక అందరి కష్టాలు తీరతాయని ఆయన బాధిత ప్రజల్లో మనోధైర్యం నింపేవారు. అవన్నీ చూశాక రాష్ట్రానికి ఇలాంటి దార్శనికుడు, విజన్‌ ఉన్న నాయకుడు అవసరమనిపించింది. 

సింగపూర్‌ను తలదన్నే అమరావతి ఎక్కడ? 
అమరావతిని సింగపూర్‌లా చేస్తానని చంద్రబాబు భ్రమలు కల్పించారు. ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఎక్కడా శాశ్వత నిర్మాణాలు లేవు. కనీసం కనకదుర్గ ఫ్లైఓవర్‌ నాలుగేళ్లుగా పూర్తి చేయలేదు. ఇక అమరావతి అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్మడం. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా! అని సీఎం అనడం ఎంత దుర్మార్గం. టీడీపీ నేతలు ఎస్సీ, బీసీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అధికారులపై దాడులకు పాల్పడినా ఆయన కనీసం వాళ్లను మందలించలేదు.  

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల పేరిట మోసం 
కేంద్రంతో కలిసున్నంత వరకూ మోదీని పొగిడి, తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టే పథకాల్ని చంద్రబాబు తెరపైకి తెస్తున్నారు. నాకు తెలిసున్నంత వరకూ పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులివ్వడం ఎన్నడూ చూడలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఏదొక పార్టీతో పొత్తుపెట్టుకోవడం, అధికారంలోకి వచ్చాక అవన్నీ తుంగలో తొక్కడం అలవాటే. 
గత ఎన్నికల్లో బీసీలకు 120 హామీలు ఇచ్చి వేటినీ నిలబెట్టుకోలేదు.  

టీడీపీ, బీజేపీలు ప్రజల్ని మోసం చేశాయి 
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజల్ని మోసగించాయి. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు పదే పదే చెప్పారు. హోదా కోసం పోరాడిన వారిని అరెస్ట్‌ చేయించారు. ఉద్యమకారులను బెదిరించి, కేసులు కూడా పెట్టారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా పోరాడిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డే.

బీజేపీతో నాలుగేళ్లకుపైగా అంటకాగి ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మోదీకి సంబంధాలు అంటగట్టడం ఆయనకే చెల్లింది. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసమే నిర్మాణ బాధ్యతల్ని చంద్రబాబు సర్కారు దక్కించుకుందనేది బహిరంగ రహస్యం. కేంద్రానికి అప్పగించి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేది.  

జగన్‌పై ప్రజలకు అపార నమ్మకముంది 
ఇచ్చిన హామీలు నెరవేర్చగల సత్తా ఉన్న వారే ముఖ్యమంత్రి పదవికి అర్హులు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏ హామీలు నెరవేర్చలేదు. జగన్‌ మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలిస్తూ.. ప్రజలకు చేరువయ్యారు. ఆయన సీఎం అయ్యాక ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. తాము కోరుకున్న నాయకత్వ లక్షణాలు జగన్‌లో ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు.

ఏ సమస్య వచ్చినా ఆయన ప్రజల తరఫున నిలబడుతున్నారు. గత 9 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌లో సంకల్పబలం ఎక్కువ. వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి కన్నా ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. 

విలువలు, విశ్వసనీయతే జగనన్న ప్రాణం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారు. ప్రతీ అంశంపై స్పష్టత ఉంది. అందుకే గత ఎన్నికల్లో ఆయన బూటకపు హామీలివ్వలేదు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా లెక్కచేయని మనస్తత్వం. తండ్రిలాగే నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే నైజం ఆయనది.   

మరిన్ని వార్తలు