మోదీ చెప్పినందుకే..

18 Feb, 2018 02:35 IST|Sakshi
పన్నీర్‌ సెల్వం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకే ఏఐఏడీఎంకే పార్టీలోని తన వర్గాన్ని, సీఎం పళనిస్వామి వర్గంలో విలీనం చేసినట్లు తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌) వెల్లడించారు. తేని పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళతో విభేదించి ధర్మయుద్ధం జరుపుతున్న సమయంలో ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పారు. అయితే, పార్టీ పదవి చేపడతానని ప్రధానికి తెలపగా, ఆయన మాత్రం మంత్రివర్గంలోనే చేరాలని సలహా ఇచ్చారన్నారు.

అనంతరం రెండు వర్గాల విలీనంతో మంత్రి పదవి చేపట్టినట్లు చెప్పారు. అమ్మ దయవల్లే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ఆ గౌరవం తనకు చాలుననీ, పదవులపై వ్యామోహం లేదని చెప్పారు. శశికళ, టీటీవీ దినకరన్‌ కారణంగా తాను పడిన కష్టాలు, సంక్షోభం మరొకరు ఎదుర్కొని ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవారనీ, అమ్మ కోసమే ఇవన్నీ భరించాననీ తెలిపారు. అయితే, ప్రధానితో భేటీ ఎప్పుడు జరిగిందనే విషయం మాత్రం ఓపీఎస్‌ చెప్పలేదు. జయలలిత మరణం, తదనంతర పరిణామాలతో ఏఐఏడీఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళనిస్వామి నాయకత్వాల కింద రెండుగా చీలి, తిరిగి ఒక్కటయ్యాయి. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా