రాజకీయ సహకారం!

18 Feb, 2018 03:04 IST|Sakshi

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి..  ఖమ్మం, నల్లగొండ డీసీసీబీ పాలక వర్గాల కొనసాగింపు!

సహకార శాఖ ప్రతిపాదనను పట్టించుకోని వైనం.. రేపు ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలక వర్గాలపై వేటు వేయాలని ప్రతిపాదించినా.. రాజకీయ ఒత్తిళ్లతో వాటి కొనసాగింపునకే సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్‌) పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల మూడో తేదీతో ముగిసింది. డీసీసీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాలు (డీసీఎంఎస్‌), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌)ల పదవీకాలం కూడా అదే తేదీతో ముగిసినా సాంకేతికంగా శనివారంతో పూర్తయింది.

అయితే సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడటంతో వాటికి పాలక వర్గ అధ్యక్షులు, సభ్యులను పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీల పాలక వర్గాల అవినీతి బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను కొనసాగించవద్దని సహకార శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వాటికి కలెక్టర్లను పర్సన్‌ ఇన్‌చార్జులుగా నియమించాలని భావించింది.

కానీ మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షులను, డైరెక్టర్లనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం 906 ప్యాక్స్‌లలో 90 ప్యాక్స్‌లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటి ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. వాటి విషయంలోనూ ఒత్తిళ్లు రావడంతో ప్రస్తుత పాలక వర్గాలకే పర్సన్‌ ఇన్‌చార్జులను నియమించే అవకాశాలున్నాయి.

ఆసుపత్రి నిర్మాణం కోసం వసూళ్లు
రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ.. ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అలా రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆస్పత్రి నిర్మించింది. రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.

వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలక వర్గం ఇచ్చిన వివరణ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్‌ స్పష్టం చేసింది. ఓ ట్రస్టును ఏర్పాటు చేసి, దానికి డీసీసీబీ చైర్మన్‌ పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేశారని టెస్కాబ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలున్నాయి. దానికి రిజర్వు బ్యాంకు అనుమతి లేదు సరికదా కనీసం టెస్కాబ్‌కు సమాచారం కూడా లేదని సహకార శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సహకార ఆసుపత్రి శనివారమే ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు