ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

14 Feb, 2018 13:22 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే ఎంవీ కృష్ణారావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే ఎంవీ కృష్ణారావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స‍్వగృహంలో బుధవారం మరణించారు.  కృష్ణారావు నాలుగు పర్యాయాలు ఇచ్చాపురం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కుటుంబీకులు గురువారం మధ్యాహ్నం ఫిల్మ్‌ నగర్‌లోని మహాప్రస్థానంలో ఎంవీ కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కమ్యూనిస్ట్‌ నాయకుడి నుంచి పీహెచ్‌డీ వరకూ
ఎంవీ కృష్ణారావుది కృష్ణా జిల్లా చిన్నతాళపర్రు. ఆయన 1936, డిసెంబరు 12న జన్మించారు. మండవ వీయన్న చౌదరి, లక్ష్మీభాయమ్మ తల్లిదండ్రులు. ఆయన విశాఖపట్నంలో ఉన్నత చదువు చదివారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐలో చురుగ్గా వ్యవహరిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, విశాఖ కమ్యూనిస్ట్‌ శాఖకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఎమ్మెస్సీ పట్టా పొందిన ఆయన.. అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయంలో ఆరున్నరేళ్ల పాటు రసాయనశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశారు. అదే యూనివర్సిటీలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌కె బారువా వద్ద విటమిన్‌‘డి’పై పరిశోధన చేసి 1975లో పీహెచ్‌డీ పట్టా పొందారు. నిమిషానికి 700 పదాల వరకు చదివిన వివేకానందుడు, జాన్‌ కెన్నడీలను ఆదర్శంగా తీసుకొని తాను కూడా నిమిషానికి 600 పదాల వరకు చదివే నైపుణ్యాన్ని సాధించారు.

పోరాటాల్లో చురుగ్గా.. ప్రజలకు చేరువగా
వీయన్న చౌదరి ఎ1 రైల్వే కాంట్రాక్టర్‌గా ఉండటంతో తండ్రికి చేదోడు, వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్న ఎంవీ.. తన భార్య శేషమాంబతో కలసి ఇచ్ఛాపురంలో స్థిరపడ్డారు. ఉద్దానం ప్రాంతంలో రంగాల గెడ్డ, గొనామారీ గెడ్డ కాంట్రాక్ట్‌ పనులు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. అప్పటి కృషికర్‌ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే బెందాళం వెంకటేశ్వరశర్మ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. 1980లో శ్రీకాకుళంలో ఓసీలుగా పరిగణనలో ఉన్న ‘రెడ్డి’గా పిలిచే.. వారు చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో పోరాడి ‘రెడ్డిక’గా మార్చి వారిని బీసీలుగా పరిగణించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం 1982 మార్చి 29న సినీనటుడు ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాజకీయ అరంగేట్రం
1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇచ్ఛాపురం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1987లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. అయితే ఆయన ఎన్టీఆర్‌ కటౌట్‌ పెట్టుకొని గెలిచినట్లు కోర్టు తీర్పు ఇవ్వడంతో.. 1994 ఎన్నికల్లో అర్హత కోల్పోయారు. దీంతో తన అనుచురుడు దక్కత అచ్యుత రామయ్యరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. 1999లో మరో మారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి చైర్మన్‌గా, 2000లో ప్యానెల్‌ స్పీకర్‌గా, 1987 నుంచి 94 వరకు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

వైఎస్సార్‌సీపీలో చురుకైన పాత్ర
2004లో టికెట్‌ ఆశించినా టీడీపీ నాయకులు తిరస్కరించడంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సా ర్‌ మరణాంతరం ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీని సమర్థంగా నడిపించారు. మున్సిపాలిటీ, సాధారణ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసి తన శిష్యుడు పికల పోలారావు కోడలు పిలక రాజలక్ష్మిని మున్సిపల్‌ చైర్‌పర్శన్‌గా, కంచిలి మండలానికి చెందిన మరో శిష్యుడు పలికల భాస్కరరావు కుమార్తెను జెడ్పీటీసీగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు