శివసేనకు షాకిచ్చిన గవర్నర్‌..!

12 Nov, 2019 14:39 IST|Sakshi

గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీం‍కు వెళ్లనున్న సేన

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు ప్రచారం జరగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న (సోమవారం) శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు.  ఆ గడువు ముగియకముందే గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపారని ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి.

ఒకవైపు తాము అడిగిన గడువు ఇవ్వకపోగా.. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వీలులేకుండా రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్‌ సాగుతున్నట్టు వస్తున్న వార్తలతో శివసేన, ఎన్సీపీ కంగుతిన్నాయి. ఒకవేళ గవర్నర్‌ రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అహ్మద్‌ పటేల్‌తో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్‌.. తమకు అంత గడువు ఇవ్వడానికి నిరాకరించడంపైనా శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

మరోవైపు గవర్నర్‌ తీరుపై ఎన్సీపీ కూడా గుర్రుగా ఉంది. తమకు ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడింది. ఇక, శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్‌ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, అహ్మద్‌ పటేల్‌ ముంబై చేరుకున్నారు. సేనకు మద్దతుపై కాంగ్రెస్‌-ఎన్సీపీ కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా