టీజేఎస్‌ ప్రభావమెంత?

21 May, 2018 03:08 IST|Sakshi

ఇంటెలిజెన్స్‌ సర్వే

119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. టీజేఎస్, కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, టీజేఏసీ నుంచి ఉద్యమించిన టీజేఎస్‌ రాజకీయంగా నిల దొక్కుకుంటుందా, అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించాయి. 

ఆ సభ నుంచే ప్రారంభం... 
తెలంగాణ జన సమితి గత నెల 29న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు పొలిటికల్‌ అనాలసిస్‌ జాబితాలో టీజేఎస్‌ను చేర్చాయి. అన్ని రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం, సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో రూపొందించే ఇంటెలిజెన్స్‌ వర్గాలు... అందులో భాగంగానే గత నెల చివరి నుంచి నాలుగు రోజుల క్రితం వరకు టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ, వివిధ కులాలు, వర్గాల నుంచి అభిప్రాయం సేకరించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఐదు ప్రశ్నలకు అవును, కాదు, ఇప్పుడే చెప్పలేం అన్న సమాధానాల ద్వారా అభిప్రాయాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. 
ఉద్యోగుల్లో భారీ చర్చ...: తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్‌ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం.
 
ఎక్కడెక్కడ ప్రభావం... 
సర్వేలో టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్‌ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు చర్చ జరుగుతోంది. అయితే పూర్తిస్థాయి పార్టీకి ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్‌ మేనేజ్‌మెంట్‌లో పార్టీ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పొందుపరిచింది. అలాగే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ వంటి పార్టీల నుంచి ప్రస్తుతానికి టీజేఎస్‌లోకి వలసలకు అవకాశం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 

ఇంటెలిజెన్స్‌ వర్గాలు అడిగిన ప్రశ్నలివే... 

  • టీజేఎస్‌ పార్టీ గురించి మీకు తెలుసా? 
  • కోదండరాం, ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయమవుతుందని భావిస్తున్నారా? 
  • టీజేఎస్‌ ఆరోపిస్తున్నట్టు అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందనుకుంటున్నారా? 
  • టీజేఎస్‌ పార్టీ చెప్తున్నట్టు సామాజిక న్యాయం ఆపార్టీ ప్రజలకు అందిస్తుందని భావిస్తున్నారా? 
  • టీజేఎస్‌ పార్టీకి రాజకీయ పరిపక్వత, ఆర్థిక స్థిరత్వం కల్గి ఉందని భావిస్తున్నారా?  
మరిన్ని వార్తలు