దేశంలోనే నంబర్‌వన్‌ దగాకోరు: జీవన్‌రెడ్డి

7 Sep, 2018 01:23 IST|Sakshi

గొల్లపల్లి/రాయికల్‌: ప్రజాసంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధిలేని కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌వన్‌ దగాకోరు అని కాంగ్రెస్‌ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో ధర్మపురి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల భేటీలో, అలాగే రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన చేతకాక మధ్యలోనే వదిలేసిన అసమర్థుడని మండిపడ్డారు. రాష్ట్రప్రజల ఆశలను వమ్ము చేసిన దద్దమ్మన్నారు. కుటుంబ పాలన, నియంతృత్వం, ఒంటెత్తు పోకడలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారని తూర్పారాబట్టారు.

ప్రచార ఆర్భాటాలు, కమీషన్ల కక్కుర్తి, సొంత డబ్బా తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, నాలుగేళ్లలో కేవలం 14 వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రైతుబీమా పథకం పెద్ద మోసమన్నారు. 636 కోట్లు ఎల్‌ఐసీకి కట్టాడని, 18 రోజుల్లో 365 మందికి చెల్లించామని ప్రక టించాడని, రోజు రూ.కోటి లెక్క వేసుకున్నా ఏడాదికి రూ.365 కోట్లు అవుతాయని, మిగతా సొమ్ము ఆయన ఖాతాల్లోకేనని ఆరోపించారు.

తమ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి రూ.5 లక్షలు చెల్లిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.  అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమైందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఆయ న అహంకారపూరిత రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ శుద్ధజలాన్ని అందించే వరకూ ఓట్లు అడగబోమని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడెలా వెళ్తున్నారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు