జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్‌

1 Dec, 2019 04:44 IST|Sakshi
పోలింగ్‌ బూత్‌ వద్ద పిస్టల్‌తో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎన్‌ త్రిపాఠి, జార్ఖండ్‌లోని లతేహార్‌లో పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లకు తినుబండారాలు అందిస్తున్న పోలింగ్‌ సిబ్బంది

ఆయుధంతో పోలింగ్‌ బూత్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి

రాంచీ: జార్ఖండ్‌లో మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. శనివారం జరిగిన ఈ పోలింగ్‌లో 64.12% పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుమ్లా జిల్లాలో ఓ కల్వర్టు వద్ద నక్సలైట్లు బాంబు పేల్చారని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని అదనపు డీజీపీ మురారి లాల్‌ మీనా చెప్పారు. దల్తన్‌గంజ్‌ నియోజకవర్గంలోని కోసియారాలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎన్‌ త్రిపాఠి ఆయుధాలతో పోలింగ్‌ బూత్‌లో ప్రవేశించాలని చూడగా పోలీసులు అడ్డుకొని అతని నుంచి ఓ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లను సీజ్‌ చేశామని పలమౌ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ శాంతను అగ్రహారి తెలిపారు.

నక్సల్స్‌ ప్రభావితం, చలికాలంలో త్వరగా చీకటి పడుతున్నందున ఉదయం 7కు ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగించినట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఆరోగ్య శాఖ మంత్రి రామ్‌ చంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌ ఓరాన్, బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన ఆ పార్టీ చీఫ్‌ విప్‌ రాధాక్రిష్ణ కిషోర్‌లు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు