కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా

12 Mar, 2020 04:24 IST|Sakshi
పుష్పగుచ్ఛమిచ్చి బీజేపీలోకి జ్యోతిరాదిత్యను ఆహ్వానిస్తున్న బీజేపీ చీఫ్‌ నడ్డా

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన జ్యోతిరాదిత్య

మధ్యప్రదేశ్‌ నుంచి ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

కొత్త ఆలోచనలను, నూతన నాయకత్వాలను కాంగ్రెస్‌ అంగీకరించడంలేదన్న సింధియా

శిబిరాల్లోకి మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ/భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి బుధవారం కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత, గ్వాలియర్‌ రాజవంశ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దాంతో, ఆయన మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టే దిశగా తొలి అడుగు పడినట్లైంది.

సింధియా అనుయాయులైన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో పతనం అంచుల్లో ఊగిసలాడుతున్న మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రాజీనామాలు చేయగా మిగిలిన తమ ఎమ్మెల్యేలను రాజస్తాన్‌లోని జైపూర్‌కు తరలించింది. బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచింది. తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్‌ నేత ద్వారా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్‌ సభ్యులు ఉన్న రాజస్తాన్‌(జైపూర్‌)లో కాంగ్రెస్‌.. బీజేపీ ఎమ్మెల్యేలున్న హరియాణా(గురుగ్రామ్‌)లో, కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలున్న కర్నాటక(బెంగళూరు)లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230 కాగా, ప్రస్తుతం 228 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్‌ రెబెల్స్‌ అయిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, ఆ సంఖ్య 206కి చేరుతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 104 అవుతుంది. ఆ పరిస్థితుల్లో.. 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కానుంది. ఇప్పటివరకు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చిన నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చే వీలుంది.  

ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం
అయితే, విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. ‘మాతో 95 మంది పార్టీ ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీ సభ్యులు మాకే మద్దతిస్తారు’ అని రాష్ట్ర మంత్రి ప్రియవ్రత్‌ సింగ్‌ తెలిపారు. ‘22 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్‌ను వీడిపోమని చెప్పారు. జ్యోతిరాదిత్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చేందుకే ఈ పని చేశాం అని వారు చెప్పారు. సింధియా పార్టీని వదిలి వెళ్తారని మేం ఊహించలేదు’ అని పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ అన్నారు. ‘మేం సింధియాను రాజ్యసభకు పంపించగలం కానీ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా మాత్రమే ఆయనను కేంద్రమంత్రిని చేయగలరు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

2018 ఎన్నికల్లో విజయం అనంతరం జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేశామని, అయితే, ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించి, తన మద్దతుదారుకు ఆ పదవి ఇవ్వాలని కోరారని దిగ్విజయ్‌ వెల్లడించారు. ఈ సంక్షోభం వెనుక బీజేపీ ఉందని, ఈ ఆపరేషన్‌కు ఆ పార్టీనే నిధులను సమకూరుస్తోందని ఆరోపించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూలుస్తానని మోదీ, షాలకు సింధియా ప్రతిపాదన పంపారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు దాన్ని అడ్డుకున్నారు. ఆ పనికి సింధియా ఎందుకు? మేమే ఆ పని చేయగలం అని షాకు చెప్పారు. కానీ, వారి ప్రయత్నాన్ని మేం సాగనివ్వలేదు. దాంతో, ఇప్పుడు షా స్థానిక నాయకులను పిలిచి, మీరంతా పనికిరానివారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే పనిని ఇప్పుడు సింధియాకు అప్పగిస్తున్నా అని వారికి చెప్పారు’’ అని దిగ్విజయ్‌ మధ్యప్రదేశ్‌ సంక్షోభాన్ని వివరించారు.   

ప్రజా ప్రభుత్వాలను కూల్చే కుట్ర
మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ప్రజా ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న మీకు చమురు ధరలు 35% తగ్గిన విషయం బహుశా దృష్టికి రాలేదనుకుంటా. ఆ తగ్గుదల ప్రయోజనాలను ప్రజలకు కల్పించండి’ అని ట్వీట్‌ చేశారు.  

రాజమాత గుర్తొచ్చారు
సింధియా బీజేపీలో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సింధియా నానమ్మ, గ్వాలియర్‌ రాజమాత, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విజయరాజె సింధియాను గుర్తు చేసుకున్నారు. ఆమె మనవడు బీజేపీలోకి రావడం తనకు అత్యంత సంతోషకరమైన విషయమన్నారు.

మహారాజ్, శివరాజ్‌ ఇప్పుడు ఒకే పార్టీలో
జ్యోతిరాదిత్య బీజేపీలో చేరడాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ స్వాగతించారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నినాదమైన ‘మాఫ్‌ కరో మహారాజ్‌.. హమారా నేతాతో శివరాజ్‌ (క్షమించండి మహారాజ్‌.. మా నాయకుడు శివరాజ్‌)’ను విలేకరులు గుర్తు చేయగా.. ఇప్పుడు, మహారాజ్, శివరాజ్‌ ఒకే పార్టీలో ఉన్నారని చమత్కరించారు. జ్యోతిరాదిత్య స్థానికుల్లో మహారాజ్‌గా చిరపరిచితుడు.

9 మంది అభ్యర్థులు
మార్చి 26న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ నుంచి తమ అభ్యర్థిగా జ్యోతిరాదిత్యను బీజేపీ ప్రకటించింది. సింధియాతోపాటు గుజరాత్‌ నుంచి ఇద్దరిని, అస్సాం, బిహార్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, మణిపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 9 మంది అభ్యర్థులతో ఒక జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మిత్రపక్షాలు ఆర్పీఐ, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌లకు ఒక్కో సీటును కేటాయించింది. ఆర్పీఐ తరఫున కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశముంది.   

వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదు
బీజేపీలో చేరిన సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై లోతైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఒకప్పటి పార్టీ కాదని, ఇప్పుడు ఆ పార్టీ వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త ఆలోచనలను, నూతన నాయకత్వాలను ఆమోదించలేకపోతోందన్నారు. మోదీపై సింధియా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సమర్ధుడైన నేత అని, దేశ సేవ కోసం సంపూర్ణంగా అంకితమైన వ్యక్తి అని పొగిడారు. ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. దేశ ప్రతిష్టను మోదీ విశ్వవ్యాప్తం చేశారన్నారు.

2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కలలు కన్నానని, ఈ 18 నెలల్లో అవన్నీ కల్లలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, రైతులు, యువత నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ప్రజలకు సేవ చేయాలన్న తన ఆకాంక్ష నెరవేరదని అర్థమైందన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌  ప్రభుత్వ మనుగడపై మాత్రం ఆయన ఏ వ్యాఖ్యలు చేయలేదు.

ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు: రాహుల్‌
తనకు అత్యంత సన్నిహితుడైన సింధియా పార్టీని విడిచి పెట్టడంతో రాహుల్‌గాంధీ కాస్త కలత చెందినట్టు కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌లతో కలిసి ఉన్న ఫోటోకి లియో టాల్‌స్టాయ్‌ ప్రఖ్యాత కొటేషన్‌ పోరాటయోధులు అంటే ఎవరో కాదు సహనం, సమయం అంటూ తాను చేసిన ట్వీట్‌ని మళ్లీ రాహుల్‌ రీ ట్వీట్‌ చేశారు. ఆయన ఎందుకు దీనిని రీట్వీట్‌ చేశారో ఎవరికీ అర్థం కాలేదు కానీ ‘‘నా ఇంటికి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా హాయిగా వచ్చే నాయకుడెవరైనా ఉన్నారంటే జ్యోతిరాదిత్య సింధియాయే, ఆయన నాకు కాలేజీ రోజుల నుంచి బెస్ట్‌ ఫ్రెండ్‌‘‘అన్న రాహుల్‌ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో తెలుస్తోంది.

భోపాల్‌ నుంచి జైపూర్‌కు ప్రత్యేక విమానంలో బయల్దేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు