ఆ గట్టునుంటావా... నాగన్న! ఈ గట్టుకొస్తావా?

21 Apr, 2018 09:27 IST|Sakshi
ఇందిరాగాంధీ కూడలిలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ దీక్ష

కదిరి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు

కదిరి : నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సీఎం చంద్రబాబునాయుడు ధర్మదీక్ష పేరుతో చేపట్టిన దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా తన వర్గీయులతో స్థానిక ఇందిరాగాంధీ కూడలిలో దీక్ష చేశారు. అయితే ఆ పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ ఎప్పటిలాగే ఎమ్మెల్యేతో కలవకుండా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట తన వర్గీయులతో దీక్షకు దిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చాలామంది కార్యకర్తలు ఎవరి శిబిరానికీ వెళ్లకుండా ఇంటివద్దే ఉండిపోయారు. కొందరైతే ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజీనే మంచిదని చెప్పిన మనమే ఇప్పుడు హోదా కావాలంటూ దీక్ష చేయడమేంటని ప్రశ్నిస్తూ ఇంటిపట్టునే ఉండిపోయారు.

ఇద్దరు నాయకులు తమ దీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో కన్పించలేదు. ప్రతి గ్రామానికీ ప్రత్యేకంగా వాహనాలు పెట్టినా అవి ఖాళీగా తిరిగొచ్చాయి. అందుకే ఇరువురి దీక్షా శిబిరాల్లోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కందికుంట విషయం గ్రహించి చివరకు మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులను రప్పించుకున్నారు. చాంద్‌ అవేమీ పట్టించుకోకుండా ఖాలీ కుర్చీల ఎదుటే దీక్షను ముగించారు.
రోడ్డుకడ్డంగా దీక్షా శిబిరాలు
ఎమ్మెల్యే చాంద్‌బాషా ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఎదురుగా జాతీయ రహదారిపైనే తమ శిబిరాన్ని వేశారు. కందికుంట తామేం తక్కువ కాదంటూ కోర్టు రోడ్డును బ్లాక్‌ చేసి మెయిన్‌ రోడ్డుపైనే తన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించారు. 

మరిన్ని వార్తలు