ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం : కమల్‌ హాసన్‌

27 Apr, 2019 07:31 IST|Sakshi

నేడు ఎంఎన్‌ఎం పార్టీ అభ్యర్థుల వెల్లడి  

పెరంబూరు: రాష్ట్రంలోని 4 స్థానాల్లో శాసనసభ ఉప ఎన్నికలు మే 19వ తేదీన జరగనున్నాయి. దీంతో ఈ స్థానాల్లో కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ పోటీ చేయనుంది. అరవకురిచ్చి, సూళూర్, ఒట్టపిడారం, తిరుప్పరకుండ్రం మొదలగు 4   అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారితో పాటు దినకరన్‌ అమ్మా మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ, కమలహాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ, సీమాన్‌ నామ్‌ తమిళర్‌ పార్టీల తరఫున అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. దీంతో పంచముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే మక్కళ్‌ నీది మయ్యం పార్టీ మినహా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో కమలహాసన్‌ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించనున్నారు. అదేవిధంగా ఆ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీని గురించి మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ప్రదాన కార్యాలయం ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. అందులో.. జరగనున్న నాలుగు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను శనివారం వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లను సోమవారం దాఖలు చేస్తారని తెలిపారు. ఈ నాలుగు శాసనసభ ఎన్నికలు తమకు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. అందువల్ల 40 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు ఎలాగైతే కష్టపడి ప్రచారం చేశామో ఆదే స్థాయిలో ఈ నాలుగు శాసనసభ స్థానాల ఎన్నికలకు ప్రచారానికి కమలహాసన్‌ సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.

ఎన్నికల సరళిపై సమీక్ష
జరిగిన లోక్‌సభ ఎన్నికలపై అభ్యర్థులను కార్యాలయానికి పిలిపించి ఓటింగ్‌ సరళి, గెలుపు, ఇతర సమస్యలు వంటి విషయాల గురించి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇది జరగనున్న శాసనసభ ఎన్నికల్లోనూ తమకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఇకపై జరిగే ఎన్నికల్లోనూ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ పోటీ చేస్తుందని, అందుకు తమ పార్టీ వ్యూహం వేరుగా ఉంటుందని పార్టీ నిర్వాహకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు