‘డబ్బులు వస్తాయంటేనే శంకుస్థాపనలు’

26 Nov, 2019 13:08 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఉనికి కోసమే చంద్రబాబు నాయుడు కడపకు వచ్చాడని, డబ్బులు ఇచ్చి ప్రజలను సమావేశానికి రప్పించారని కమలాపురం వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడు రవీంద్రనాధ్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ.. మా అభ్యర్థి ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే చంద్రబాబు కుప్పంలో గెలిచారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. డబ్బులు వచ్చే ప్రాంతంలో మాత్రమే శంకుస్థాపనలు చేసి లక్షల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవి ముగిసే సమయంలో 65 వేల కోట్ల రూపాయలు అప్పుచేశాడని, ప్రపంచంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడని పేర్కొన్నారు. ‘ప్రతీ పథకాన్ని అధికారం ముగిసే సమయానికి అమలు చేశారు. యువకులు, మహిళలు, రైతులు, సంఘాలను మోసం చేసిన చంద్రబాబును, టీడీపీని ప్రజలే భూస్థాపితం చేశార’ని తెలిపారు. ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టి, ఓడిపోయాక తన రాజ్యసభ సభ్యులను అదే పార్టీలోకి చంద్రబాబే పంపారని వెల్లడించారు. రాష్ట్రం అప్పులకుప్పగా మారిన సందర్భంలో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఇచ్చారని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని పునరుద్ఘాటించారు. 


 

మరిన్ని వార్తలు