‘నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే!’

31 Mar, 2019 07:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘రాజకీయాలంటే సమాజంలో అణచివేతకు, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం. రాజకీయాలంటే మనల్ని విడదీసే శక్తులకు ఆవల, మనల్ని కలిపే మహత్తర సన్నివేశం కోసం భారత్‌కంటున్న కలను సాకారం చేయడం. రాజకీయాలంటే అభివృద్ధి, ప్రగతిశీల ఆలోచనలు కలిగిన నిజమైన వ్యక్తిత్వ హక్కులు కలిగిన సుందర సమాజం స్థాపించడం కోసం, రాజకీయాలంటే గడచిన ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం కాదు, రానున్న 20 ఏళ్లలో రానున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం, అందుకోసమే నాకు రాజకీయాలు కావాలి’ అని బీహార్‌లోని బేగుసరాయి లోక్‌సభ నియోజక వర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌ స్వయంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసుకున్న వ్యాసంలోని ఓ భాగం సారాంశం.

‘అవును నేను ప్రమాదవశాత్తే రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయ వాదినే. కాని ఏ నాడు లోక్‌సభకు పోటీ చేయాలని అనుకోలేదు. ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తోటి విద్యార్థుల మధ్య లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్థావన వచ్చినప్పుడు మనమూ పోటీ చేస్తే! అనే మాట వచ్చి నవ్వుకునే వాళ్లం. కానీ పోటీ చేయాలని నిజంగా ఎన్నడూ అనుకోలేదు’ అని కుమార్‌ తెలిపారు. ఆయన విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారంటూ ‘మార్పిడి చేసిన వీడియో’ ఆధారంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టడం, యూనివర్శిటీ అధికారులు ఆయన్ని కొన్ని రోజులు సస్పెండ్‌ చేయడం, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆ కేసు విచారణ ముందుకు సాగక పోవడం, ఈ లోగా కుమార్‌ తన పీహెచ్‌డీ పూర్తి చేసుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. సీపీఐకి అనుబంధంగా ఉన్న అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్‌) నాయకుడు అవడం వల్ల కన్హయ కుమారు సీపీఐ రాజకీయాల్లోకి వచ్చారు. ‘ నీకు రాజకీయాల పట్ల శ్రద్ధ లేనంత మాత్రాన రాజకీయాలకు నీ పట్ల శ్రద్ధలేదని అనుకోకు–అని గ్రీక్‌ తత్వవేత్త పెరికల్స్‌ అన్నట్లు రాజకీయాలే నా పట్ల శ్రద్ధ చూపాయి. అందుకే నేను రాజకీయాల్లోకి రాక తప్పలేదు. నేను ఈ పార్టీకో, ఆ పార్టీకో ప్రత్యామ్నాయమంటూ చెప్పుకోవడానికి రాలేదు.’

‘ఇప్పుడు మనమంతా ఉచితంగా అందించాల్సిన విద్య గురించి, ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్య సేవల గురించి, వారికి కావాల్సిన సదుపాయాల గురించి ప్రశ్నించాలి. ఒక్క మైనారిటీల గురించో, అణగారిన వర్గాల గురించో మాట్లాడితే సరిపోదు. తాడిత, పీడిత అన్ని వర్గాలతోపాటు హిజ్రాల గురించి, స్వలింగ సంపర్కుల గురించి కూడా ప్రశ్నించాలి. పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా స్త్రీ, పురుష సమానత్వ వ్యవస్థ కోసం పోరాడాలి. దేశానికి ఎదురవుతున్న కొత్త సవాళ్ల గురించి మాట్లాడాలి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరంతోపాటు డిజిటల్‌ విప్లవం గురించి మాట్లాడాలి. వ్యక్తిగత గోప్యత అవసరం గురించి మాట్లాడాలి. సామాజిక వేదికలపై మనం ఒకటి కావాలి. అంతిమంగా ధనవంతుల జేబుల్లో చిక్కుకున్న రాజకీయ వ్యవస్థను వెలికితీసి పన్ను చెల్లించే సామాన్యుల చేతుల్లో పెట్టేవరకు పోరాడాలి. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను’ అంటూ కన్హయ కుమార్‌ తన రాజకీయ నేపథ్యం గురించి  ఆ వ్యాసంలో వివరించారు.

>
మరిన్ని వార్తలు