ఆ పార్టీకో దండం

7 Mar, 2018 08:11 IST|Sakshi
మహేశ్‌గౌడతో ఉప్పి (ఫైల్‌)

కేపీజేపీకి హీరో ఉపేంద్ర రాజీనామా

‘ప్రజాకీయ పార్టీ’ ఏర్పాటు

అంతటికీ మహేశ్‌గౌడే కారణమని ధ్వజం

అంతా అనుకున్నట్లుగానే అయ్యింది. రాజకీయాల్లో ప్రజలే ప్రభువులని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని, ప్రజా రాజకీయాలే నడపాలని ప్రకటిస్తూ కేపీజేపీని ఆరంభించిన హీరో ఉపేంద్ర ఆ పార్టీకో దండం పెట్టి బయటకు వచ్చారు. ఆ వెంటనే ప్రజాకీయ అనే మరో పార్టీకి ప్రాణం పోశారు.

సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు ఉపేంద్ర కేపీజేపీ పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే చీలికలు ఏర్పడ్డాయి. గత ఏడాది అక్టోబర్‌ 31న బెంగళూరులో పార్టీ పురుడు పోసుకోవడం తెలిసిందే. వ్యవస్థాపకుడు మహేశ్‌గౌడ, పార్టీ అధ్యక్షుడు ఉపేంద్రల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో మంగళవారం నటుడు ఉపేంద్ర కేపీజేపీకి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికతో పాటు అనేక విషయాల్లో ఉభయుల మధ్య తీవ్ర పొరపొచ్ఛాలు వచ్చినట్లు తేలింది. మీరు సూచించిన అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపితే కనీసం 20 ఓట్లు కూడా రాలవని మహేశ్‌గౌడ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నేతల వైఖరితో ఆవేదన చెందిన ఉప్పి గతకొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతర్గత విభేదాలు సోమవారం బహిర్గతం కావడంతో ఉపేంద్ర రాజీనామాకే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉపేంద్ర నగరంలోని రుప్పీస్‌ రిసార్ట్‌లో మీడియాతో మాట్లాడారు.

కేపీజేపీ పార్టీతో ఇక తనకు ఎలాంటి సంబంధం లేదు, నేటితో కేపీజేపీతో బంధం తెగిపోయిందంటూ వాఖ్యానించారు. చివరిసారిగా మహేశ్‌గౌడకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించామని అయితే ఆయనకు పార్టీ శ్రేయస్సు, ప్రజాసేవ కంటే పబ్లిసిటీనే కావాలన్నట్లు అర్థమయిందని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, సొంతంగా ‘ప్రజాకీయ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించనున్నామని నేటి నుంచే ప్రజాకీయ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిపారు. తమతో పాటు తమ సిద్ధాంతాలు నచ్చిన మరికొంత మంది నేతలు,కార్యకర్తలు కూడా కేపీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ పార్టీలో చేరారన్నారు.

మహేశ్‌గౌడపై ప్రియాంక విమర్శలు
ఉపేంద్ర సతీమణి, నటి ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో ఉపేంద్ర ఇమేజ్‌ దెబ్బతింటుందని భయపడ్డామన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసి ప్రజాకీయ అనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడం ద్వారా ఉపేంద్ర మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. మహేశ్‌గౌడ ప్రవర్తన ఉపేంద్రతో పాటు తమను,పార్టీకి రాజీనామా చేసిన నేతలను కూడా ఎంతగానో బాధించిందన్నారు. కేపీజేపీ రాజీనామా చేసిన అనంతనం ఉపేంద్రకు కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని అయితే ఎటువంటి రాజకీయ చట్రంలో చిక్కుకోకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే కొత్త పార్టీని స్థాపించారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో దర్శకురాలు రూపా అయ్యర్, ముఖ్య అభిమానులు పాల్గొన్నారు. రూపా మాట్లాడుతూ మహేశ్‌గౌడ ఈ విధంగా ప్రవర్తించడం తమను కలచివేసిందని, అతని మనసులో ఇంత కుట్ర దాగి ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని అన్నారు.

మరిన్ని వార్తలు