ఇది గ్రీన్‌ పాలిటిక్స్‌ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్‌ పార్టీలుగా..!

6 Nov, 2023 10:21 IST|Sakshi

క్లైమెట్‌ పాటు పొలిటికల్‌ క్లైమెట్‌ కూడా గుణాత్మకంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు తోక పార్టీలుగా ఉన్న గ్రీన్‌ పార్టీలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే దశకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. పర్యావరణ చైతన్యంతో కూడిన ప్రజాస్వామిక రాజకీయాలతో పాటు శాంతి, అహింస, సామాజిక న్యాయంతో కూడిన సమాజం కోసం గ్రీన్‌ పార్టీలు కలలు కంటున్నాయి. ఈ క్లైమెట్‌ ఎమర్జెన్సీ కాలంలో పారిశ్రామిక దేశాల రాజకీయాల తోపాటు మన రాజకీయాలు కూడా పర్యావరణ కేంద్రంగా ఇకనైనా మారేనా?

పర్యావరణ సమస్యలపై సాంఘిక ఉద్యమాలు నిర్మించే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్‌ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో ఎక్కువగా గ్రీన్‌ పార్టీలు పుట్టుకు రావటమే కాదు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి కూడా. 1960వ దశకంలో రాడికల్‌ సోషల్‌ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్‌ పార్టీలు ఆవిర్భవించాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్‌ దేశాల్లో గ్రీన్‌ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది.

కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేపడుతుండటం విశేషం. క్లైమెట్‌ ఛేంజ్‌ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్‌ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది.

1972 నుంచి గ్రీన్‌ పార్టీల పుట్టుక
తొలి రెండు గ్రీన్‌ పార్టీలు ఆస్ట్రేలియా (ద యునైటెడ్‌ తస్మానియా గ్రూప్‌), న్యూజిలాండ్‌ (ద వాల్యూస్‌ పార్టీ)లలో 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో పీపుల్‌ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్‌ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది.

గ్రీన్‌ పార్టీ అంటే..?
ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరిమితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించే రాజకీయ పార్టీలే గ్రీన్‌ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్‌ డెమోక్రటిక్‌ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి. ‘గ్లోబల్‌ గ్రీన్స్‌’ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్‌ పొలిటికల్‌ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 2001లో గ్లోబల్‌ గ్రీన్స్‌ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి.

బ్రస్సెల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్‌ రాజకీయ పార్టీలతో పాటు, 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులు గల స్టీరింగ్‌ కమిటీకి బాబ్‌ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్‌ నాటియాల్‌ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్‌ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్‌ గ్రీన్స్‌లోని పార్లమెంటేరియన్‌ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యప్తంగా విస్తరించిన 400కి పైగా గ్రీన్‌ పార్లమెంటు సభ్యులు టచ్‌లో ఉన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో
1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన గ్రీన్‌ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్‌ గ్రీన్స్‌ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్‌ పొలిటికల్‌ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్‌ గ్రీన్‌ పార్టీల కాంగ్రెస్‌’ కాన్‌బెర్రాలో జరిగింది. ఆ కాంగ్రెస్‌లోనే ‘గ్లోబల్‌ గ్రీన్స్‌ ఛార్టర్‌’ పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్‌లో, 2017లో లివర్‌పూల్‌లో గ్రీన్‌ పార్టీల కాంగ్రెస్‌లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్‌లో గ్లోబల్‌ గ్రీన్స్‌ చార్టర్‌ అప్‌డేట్‌ చేశారు.

6 మూల సూత్రాలు
పర్యావరణ జ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్‌ గ్రీన్‌ పార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తరువాతి తరానికి అందించడం మన బాధ్యత’ అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. స్థానిక, ప్రాంతీయ సమాజాలలో అధికారం, బాధ్యతలు కేంద్రీకృతమై ఉంటాయి. ఉన్నత స్థాయి పాలనకు అవసరమైన చోట మాత్రమే అధికారం, బాధ్యతలు పంపిణీ అవుతాయి..’ అని చార్టర్‌ భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి భాష్యం చెప్తోంది.

చారిత్రక బాధ్యత
యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అతిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ పనికి చారిత్రక బాధ్యతను సంపన్న దేశాలు ఇప్పటికైనా స్వీకరించాలి. భూతాపంతో వెల్లువెత్తుతున్న విపత్తులతో అన్ని దేశాలూ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇది మరీ స్పష్టమైపోయింది.

అయితే, చేయని తప్పునకు పెను నష్టానికి గురవుతున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను నష్ట నివారణ సాంకేతికతను, నగదు తోడ్పాటును అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతానికి యూరప్, అమెరికా ఖండాలకే పరిమితమైన పర్యావరణ చైతన్యంతో కూడిన రాజకీయాలు ఈ ‘క్లైమెట్‌ ఎమర్జెన్సీ’ కాలంలో మనకు కూడా అవసరమే అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు.
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

(చదవండి: ఈగలతో  ప్రొటీన్ల సేద్యం! వ్యర్థాలకు చెక్‌..ఆదాయానికి ఆదాయం!)

మరిన్ని వార్తలు