యడియూరప్ప ప్రభుత్వానికి విషమ పరీక్ష

5 Dec, 2019 08:28 IST|Sakshi

15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రారంభం

నాలుగు నెలల యడియూరప్ప ప్రభుత్వానికి మరో అగ్నిపరీక్ష. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం మనుగడ సాగించాలా, వద్దా? అన్నదానిపై ఓటరు దేవుళ్లు నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. బెంగళూరు, బెళగావి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల జ్వరం ఆవహించింది. గెలుపోటములపై బెట్టింగ్‌లు తారస్థాయికి చేరాయి. సుమారు రెండువారాల నుంచి ప్రచారంలో నిమగ్నమైన అగ్రనేతలు 9వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ రోజున వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయి.


సాక్షి, బెంగళూరు: 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీల భవితవ్యం ఇమిడి ఉంది. యడియూరప్ప సర్కారు మనుగడను తేల్చే ఉప ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.  

మినీ అసెంబ్లీ ఎన్నికలు  
 మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేరుపొందిన ఈ సమరంలో మూడు ప్రధాన రాజకీయ పారీ్టల నుంచి సీనియర్‌ నాయకులు పోటీలో ఉన్నారు. ఒకేసారి 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం కూడా రికార్డే. మొత్తం 165 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. కాగా శివాజీనగర నుంచి అత్యధికంగా 19 మంది పోటీ చేస్తుండగా, కృష్ణరాజపేటె, యల్లాపుర నుంచి అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ఓటరు కార్డు లేదా ఆధార్, రేషన్, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు తదితర 11 రకాల కార్డుల్లో ఏదైనా తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. బుధవారం ఉదయం ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ బాగానే జరుగుతుందని అన్ని పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి.   

నిర్భయంగా ఓటేయండి : సీఎం సూచన  
సాక్షి బెంగళూరు: నేడు గురువారం జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లందరు నిర్భయంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సూచించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేయాలని తెలిపారు. వానాగాలీ, చలి ఉన్నా పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సుమారు 85 శాతం పోలింగ్‌ నమోదు దాటితే ప్రజాస్వామ్యానికి బలమని బుధవారం సాయంత్రం అన్నారు.   

మరిన్ని వార్తలు