కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా కోవర్టులు: కర్నె

31 Jul, 2018 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రా ప్రాంతానికి ఏజెంట్లుగా, కోవర్టులుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీతో కలిసి పనిచేయాలనే కోరికతో కాళేశ్వరాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగంగా పనిచేస్తున్న తెలంగాణ జేఏసీ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్థంలేని విమర్శలు చేశారని అన్నారు.

ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందడం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడా మాటమీద నిలబడే పరిస్థితి లేదన్నారు. గోదావరి నీరు ధవళేశ్వరం బ్యారేజీకి, కృష్ణా నది నీరు కృష్ణా బ్యారేజీకి చేరాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారని కర్నె ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులు రీ డిజైన్‌ చెయ్యలేదా అని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎందుకు ప్రాజెక్టును పూర్తిచేయలేదో చెప్పాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్‌ ప్లేస్‌ అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఎందుకు బాధపడుతున్నాడని కర్నె ప్రభాకర్‌ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు