పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య

14 Sep, 2019 17:05 IST|Sakshi

కిలారి రోషయ్య

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలన పేరుతో ఆర్భాటాలకు పోయి వందలకోట్లు వృధా చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనతో రాజన్న రాజ్యం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్‌ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలను ఎన్నడూ ప్రశ్నించని పవన్‌ ఇప్పుడు పనిగట్టుకొని జగన్‌ను విమర్శించడం వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి పవన్‌కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట తప్పితే, అదే ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 200 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నారన్న విషయం పవన్‌ మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ. 1.50 వేల కోట్లు అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, వంద రోజుల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం పవన్‌కు గుర్తులేదా అని మండిపడ్డారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్‌, మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడైనా మీకు చెప్పారా అంటూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా అని, ధైర్యం ఉంటే నిజాయితీగా మాట్లాడాలని కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు.

అది పవన్‌కు మాత్రమే చెల్లుతుంది :
అమరావతిలో భూసేకరణకు మొదట ఒప్పుకోని పవన్‌ ఆ తర్వాత మాట మార్చడం ఆయనకు మాత్రమే చెల్లుతుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే డీజీపీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ పవన్‌కు కనిపించడం లేదన్నారు. లింగమనేని ఎస్టేట్స్‌ అధినేత.. చంద్రబాబుకు, పవన్‌లకు కామన్‌ ఫ్రెండ్‌ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఆయన ఇచ్చిన ఇళ్లలో ఉంటూ జగన్‌పై విమర్శలు చేస్తూ జనసేన ఎప్పటికీ టీడీపీ తోక పార్టీ అని నిరూపించిందన్నారు. ఇప్పటికైనా పవన్‌ చెప్పుడు మాటలు వినకుండా తన సొంత ఎజెండాతో వస్తే బాగుంటుందని హితవు పలికారు. 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం పేరుతో చంద్రబాబు నవ్వులపాలయ్యారని తెలిపారు. కాగా, వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ వేగవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా