ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం: కిషన్‌రెడ్డి

5 Jan, 2018 02:52 IST|Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేస్తామని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై పోలీసుల నిర్బంధం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజలు, ప్రజా సంఘాలు హక్కుల సాధన కోసం నిరసన తెలపడం నేరమా? అని ప్రశ్నించారు.

గిట్టుబాటు ధర కావాలని అడిగిన రైతులను, ఉద్యోగాలు కావాలని అడిగిన నిరుద్యోగులను, ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కోరిన దళితులను అరెస్టు చేసిన చరిత్ర కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. గిరిజనుల హక్కులను కాపాడాలని, హైకోర్టు తీర్పును గౌరవించి మతపరమైన రిజర్వేషన్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎమ్మార్పీ ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.

వారం వ్యవధిలో ఆయనను రెండుసార్లు అరెస్టు చేయడాన్ని బట్టీ మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. అనే సందేహం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎమ్మార్పీస్‌ ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రఘనందన్‌రావు, కె. మాధవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు