తగ్గిన బీసీల ప్రాతినిధ్యం 

27 Nov, 2018 03:52 IST|Sakshi

1985 ఎన్నికలు: పెరిగిన రెడ్ల ప్రాబల్యం 

టీడీపీ నుంచి అత్యధిక మంది గెలుపు 

1985లో ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 59 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 15 సీట్లకే పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది, సీపీఐ8 , సీపీఎం 7, జనతా మూడు స్థానాలను గెలుచుకున్నాయి. ఎంఐఎం నాలుగు సీట్లు గెలవగా, ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. కాగా టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. సామాజికవర్గాల వారీగా చూస్తే 35 మంది రెడ్లు గెలవగా, టీడీపీ పక్షాన 17, కాంగ్రెస్‌ తరపున ఎనిమిది మంది నెగ్గారు. బీజేపీ పక్షాన నలుగురు, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీలలో ఇద్దరేసి రెడ్లు గెలిచారు. కమ్మ వర్గీయులు ఏడుగురు గెలవగా ఆరుగురు టీడీపీ, ఇద్దరు సీపీఎం తరపున నెగ్గారు. వెలమ సామాజికవర్గం 11 సీట్లలో విజయం సాధించగా, ఆరుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రస్, ఒకరు బీజేపీ, ఇద్దరు సీపీఐ పక్షాన గెలిచారు. ముస్లింలు ఏడుగురు గెలవగా వారిలో మజ్లిస్‌ నలుగురు, టీడీపీ ఇద్దరు, సీపీఐ తరపున ఒకరు ఉన్నారు. బీసీలు 14   మందికి గాను  ఎనిమిది మంది టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ఒకరు సీపీఐ, ఒక ఇండిపెండెంట్‌  నెగ్గారు. ఎస్సీలలో 17 మంది గెలవగా, 13 మంది టీడీపీ తరపున గెలిచారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతాల పక్షాన ఒక్కొక్కరు నెగ్గారు. ఎస్టీలలో ఏడుగురికి గాను ఇద్దరు టీడీపీ ఇద్దరు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల పక్షాన ఒక్కొక్కరు గెలిచారు. బ్రాహ్మణులు ఐదుగురు గెలిస్తే ముగ్గురు టీడీపీ, ఒకరు బీజేపీ, మరొకరు సీపీఎం నుంచి గెలిచారు. ఒక లింగాయత్‌ కూడా విజయం సాధించారు. ఇద్దరు వైశ్యులు టీడీపీ పక్షాన విజయం సాధించారు.1983 ఎన్నికలలో టీడీపీకి ఆయా సామాజికవర్గాలలో పట్టు దొరకలేదు. కాని 1985 నాటికి దాదాపు అన్ని సామాజికవర్గాలలో టీడీపీదే పై చేయి అవడం విశేషం. 

కమ్మ వర్గం  
ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు కూడా కమ్మ వర్గం వారు ఎన్నిక కాలేదు. టీడీపీ నుంచి గెలుపొందిన ప్రముఖులలో ఎన్‌.టి.రామారావు కూడా ఉన్నారు. ఆయన తెలంగాణలోని నల్లగొండ నుంచి పోటీ చేసి గెలిచారు. దీనితో పాటు రాయలసీమలోని హిందుపూర్, ఆంధ్రలోని గుడివాడ నుంచి కూడా గెలిచి, మూడు చోట్ల ఒకేసారి గెలిచిన నేతగా రికార్డు సాధించారు. మండవ వెంకటేశ్వరరావు, కేవీ నారాయణరావు టీడీపీ నుంచి గెలవగా, సీపీఎం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు, ఆరేబండి లక్ష్మీనారాయణ విజయం సాధించారు.

వెలమలు... 
వెలమల విషయానికొస్తే, టీడీపీలో సిద్దిపేట నుంచి కె.చంద్రశేఖరరావు, ఎన్‌.యతిరాజారావు, నారాయణరావు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌లో ఇద్దరు గెలిచారు. వారిలో జీవీ సుధాకరరావు ప్రముఖుడు. బీజేపీ, సీపీఐ నుంచి గెలిచిన చెన్నమనేని విద్యాసాగరరావు, చెన్నమనేని రాజేశ్వరరావులు స్వయానా సోదరులు.
 
రిజర్వుడు స్థానాల్లో... 
తెలంగాణలోని 17 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లోనూ టీడీపీ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. గెలిచిన ప్రముఖులలో పుట్టపాగ మహేంద్రనాద్, మోత్కుపల్లి నరసింహులు తదితరులున్నారు. 

35 మంది రెడ్లు... 
ఈ ఎన్నికలలో టీడీపీ నుంచి గెలుపొందిన వారిలో జానారెడ్డి, ఇంద్రారెడ్డి, నాగం జనార్దన్‌ రెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో బాగారెడ్డి, పి.రామచంద్రారెడ్డి, పి.జనార్ధనరెడ్డి తదితరులు ఉన్నారు. జనతా పార్టీ తరపున నాయిని నరసింహారెడ్డి విజయం సాధించారు. బీజేపీలో ఇంద్రసేనారెడ్డి, సీపీఐలో విఠల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

ముస్లింలు.. 
ఎంఐఎం తరపున గెలిచిన వారిలో అమానుల్లాఖాన్‌ , మస్కతి వంటివారు ఉన్నారు. సీపీఐ నేత రజబ్‌ అలీ మరోసారి ఎన్నికయ్యారు. టీడపీ నుంచి ఇద్దరు గెలిచారు. 

బ్రాహ్మణులు 
టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఎస్‌.వేణుగోపాలాచారి, కరణం రామచంద్రరావు, బి.నాగభూషణం వంటి ప్రముఖలు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి దుద్దిళ్ల శ్రీపాదరావు, సీపీఎం నుంచి మంచికంటి రామకిషన్‌ రావు విజయం సాధించారు. వైశ్యులు ఇద్దరు గెలవగా వారిద్దరూ టీడీపీ వారే. 
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు