ఓయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం!

27 Nov, 2018 03:53 IST|Sakshi

విద్యార్థుల వెతలు 

నేడే పరీక్షలు.. ఇంకా హాల్‌టికెట్లు తీసుకోని విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఓయూలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల హాల్‌ టికెట్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మంగళవారం నుంచి ఓయూ డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. అయితే సోమవారం వరకు హాల్‌టికెట్ల రాకపోవడంతో విద్యార్థులు కంగారు పడుతున్నారు. మరికొన్ని కాలేజీలు అసలు కాలేజీకి హాల్‌టికెట్లు వచ్చాయో లేదోనన్న విషయాన్ని ఇంతవరకూ విద్యార్థులకు తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓయూ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు కాలేజీల వద్ద విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం పడిగాపులు కాయడం కనిపించింది. 

అసలేం జరిగింది? 
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఓయూ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జరుగుతాయని ఒకసారి, జరగవని మరోసారి, రకరకాలుగా ప్రచారం జరిగింది. 23 వరకు వర్సిటీ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాయి. అకస్మాత్తుగా ఈనెల 24న వర్సిటీ నుంచి విద్యార్థుల హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు కళాశాలలు హాల్‌టికెట్లు ఇవ్వలేకపోయాయి. కొన్ని కాలేజీలు మాత్రం హాల్‌టికెట్లు వచ్చిన విషయాన్ని ఎస్సెమ్మెస్‌ ద్వారా పంపించాయి. మరికొన్ని కాలేజీలు ఈ విషయాన్ని కనీసం తెలపలేదు. దీంతో సోమవారం కళాశాలకు రాని విద్యార్థులకు అసలు హాల్‌టికెట్లు వచ్చిన విషయమే తెలియలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పలు సెంటర్ల మార్పు.. 
డిగ్రీ కాలేజీల సెంటర్లు పెద్దగా మారవు. కానీ ఎన్ని కల కారణంగా కొన్ని కాలేజీలను ఎన్నికల స్ట్రాంగ్‌రూంలుగా వాడుతున్నారు. దీంతో కొన్ని కాలేజీల సెంటర్లు మారిపోయాయి. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి హాల్‌టికెట్లు వచ్చేదాకా తమకు తెలియదని, తాము మాత్రం ఏం చేయగలమని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. 

బ్లాక్‌ పెన్‌తోనే రాయాలి.. 
ఈసారి నిర్వహించబోయే పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్‌ నుంచి ఓయూ పరిధిలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రవేశపెట్టారు. మార్కుల్లో అవకతవకలు, మూల్యాంకనంలో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో ఆన్సర్‌షీట్‌ స్పష్టంగా కనిపించాలంటే విద్యార్థులంతా బ్లాక్‌పెన్‌తోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు హాల్‌టికెట్లు అందకపోవడంతో చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలియకుండా పోయిందని పలు కాలేజీల లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  24న హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం హడావుడిగా విద్యార్థులకు ఇచ్చారు. మంగళవారం ఉదయం త్వరగా వస్తే తీసుకోని వారందరికీ హాల్‌టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు