కారు ప్లస్‌ సారు.. కేంద్రంలో సర్కారు!

7 Mar, 2019 02:27 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ఇదే మన నినాదం 

కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ 

మోదీపై భ్రమలు తొలగిపోయాయి.. రాహుల్‌ పరిస్థితి దిగజారింది 

ఎన్‌డీఏకు 160 సీట్లు కూడా కష్టమే.. యూపీఏకు 110 సీట్లే..  

100 సీట్లతో కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంటే కీలకం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లోని భావసారూప్యత ఉన్న పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రక్రియలో భాగంగా బుధవారమిక్కడ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీపై ప్రజలకు ఎన్నో భ్రమలు ఉండేవని.. అయితే, మోదీ పాలనలో దేశం బాగుపడదని ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు.

ఎన్‌డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 నుంచి 160 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 110 సీట్లు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ, యూపీఏ ఇలా రెండు కూటములు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి ఉండదన్నారు. లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అంటూ కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని.. కానీ ఆ పార్టీలు దొందూ దొందే అని తేలిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచే 16 మంది ఎంపీలే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని, కేసీఆర్‌ నేతృత్వంలోని కొత్త కూటమి 100పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘కారు ప్లస్‌ సారు.. ఢిల్లీలో సర్కారు’అనే నినాదంతో ముందుకు సాగాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

అది విడదీయరాని సంబంధం: కేసీఆర్‌కు కరీంనగర్‌తో ఉన్న సంబంధం మామూలుది కాదని, ఆయన ఏ పని ప్రారంభించినా కరీంనగర్‌ నుంచే మొదలుపెట్టి విజయాలు అందుకున్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ‘కేసీఆర్‌ కరీంనగర్‌ అల్లుడు. ఆయనకు కరీంనగర్‌తో ఎంతో అనుబంధం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కరీంనగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 2001 మే 17న ఇదే ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సింహగర్జన సమయంలో నేను అమెరికాలో ఉన్నా. 2006లో కరీంనగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చా. నేను ఇక్కడే మిషన్‌ హాస్పిటల్‌లో పుట్టిన. ఇక్కడి స్కూల్‌లోనే చదివిన. అప్పర్‌ మానేరులో నాయినమ్మ భూములు పోయినయి. మిడ్‌ మానేరులో అమ్మమ్మ భూములు కోల్పోయినం. ఇక్కడ బాలకృష్ణ, తీరందాస్, శ్రీనివాస సినిమా థియేటర్లు నాకు తెలుసు. కరీంనగర్‌ వస్తున్నానని రాత్రి కేసీఆర్‌ను కలిసిన. చాలా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ముస్తాబాద్‌ మండలం గూడూరు దగ్గరుండే మానేరు కాలువలో చిన్నప్పుడు స్నానాలు చేసిన విషయాలను గుర్తు చేశారు. కేసీఆర్‌ నా కుమారుడంత వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ రైల్వే లైన్‌ కోసం అక్కడ సర్వే చేసి కొయ్యలు గొట్టిన విషయాలు చెప్పారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఆ రైల్వే లైన్‌ మంజూరైంది’అని వివరించారు.  

అందరూ మనోళ్లే.. కేసీఆర్‌ మనుషులే.. 
కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్తలైనా అందరూ మనోళ్లే.. అందరూ కేసీఆర్‌ మనుషులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ‘సిరిసిల్లలో నాపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా రైతుబంధు పథకం కింద డబ్బులు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత వాళ్ల ఓటు అడగడానికి మనకు మొహమాటం అవసరం లేదు. మనోడు కాదనే ముద్ర వేయొద్దు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా అనుకూలంగా మలుచుకోవాలి. ఇక ఎంపీ అభ్యర్థి ఎవర న్నది ముఖ్యం కాదు. ఓటేసేది కేసీఆర్‌కి మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలి. ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే మన హక్కులు సాధించుకోగలం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజారిటీ ఇవ్వాలని కోరారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హోంమంత్రి మహమూద్‌ అలీ, జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, సీహెచ్‌ రమేష్‌బాబు, సుంకు రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, చందర్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గులాబీలా.. గులాములా.. నిర్ణయించుకోవాలి
‘పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించుకోవాలి. తప్పిపోయి ఒకటో రెండో సీట్లు కాంగ్రెస్‌ గెలుస్తే ఏమవుద్ది? ఢిల్లీకి గులాములుగా మారిపోతారు. ఏ పనికైనా ఢిల్లీలో రాహుల్‌ అనుమతి తప్పనిసరి. టికెట్లు, బీ ఫారం సహా ఏది కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. అలాంటి ఢిల్లీ గులాములు రాష్ట్రానికి న్యాయం చేస్తారా ప్రజలు ఆలోచించాలి. తెలంగాణకు న్యాయం చేసే గులాబీలు కావాలా? ఢిల్లీ గులాములు కావాలో తేల్చుకోవాలి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్‌ ఎంపీగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్‌ పేరు ప్రస్తావించకుండా ఆయనపై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ కలిసిరాని ఆయన కేసీఆర్‌ దీక్ష తర్వాత తానే ఉద్యమకారుడిగా బిల్డప్‌ ఇచ్చుకున్నారని విమర్శించారు. 

>
మరిన్ని వార్తలు