త్వరలోనే చూస్తారుగా : కేటీఆర్‌

15 Dec, 2018 16:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ నాయకుడు కేసీఆర్‌ దేశం కోసం ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని చూస్తుంటే.... ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం తెలుగుదేశం బాగుకోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో సుమారు 2 కోట్ల మంది ఓటు వేస్తే అందులో 98 లక్షల మంది ప్రజలు తమ పార్టీపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీ కట్టబెట్టారన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పినట్లుగా ఇక్కడ నిశ్శబ్ద విప్లవం లేదని శబ్ద విప్లవమే వారికి సరైన సమాధానం చెప్పిందని ఎద్దేవా చేశారు.

త్వరలో చూస్తారు..
తెలంగాణలో మహాకూటమి ఓటమిని ప్రస్తావిస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... ‘ చంద్రబాబు నాయుడు సెల్‌ఫోన్లు, మొబైల్‌ ఫోన్లు కనిపెట్టానని చెబుతారు. తెలంగాణ ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే ఆ క్రెడిట్‌ కూడా కొట్టేయాలని చూశారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారు. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఆనాడు ప్రత్యేకహోదా సంజీవని కాదు అన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే జిందాతిలిస్మాత్‌ అంటున్నారు. హోదా విషయంలో ఆయనే గందరగోళంలో ఉన్నారు. కేవలం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీని బూచిగా చూపి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీది నామమాత్రపు పాత్రే. అయితే జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వచ్చేలా, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కాబట్టి దేశంలో అంతర్భాగమైన ఏపీ రాజకీయాల్లో కూడా మా పాత్ర ఉంటుంది. అయితే అది ఏ రూపంలో అనేది త్వరలో చూస్తారు’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు