పర్యాటకం ఓట్లు రాల్చేనా?

9 May, 2019 02:10 IST|Sakshi

కురుక్షేత్ర.. పురాతన ఆలయాలకు నిలయం. చారిత్రక ప్రాధాన్యత గల 1200 ఏళ్ల నాటి దేవాలయం కూడా ఉందిక్కడ. ఈ నేపథ్యంలో నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది బీజేపీ సర్కారు. ప్రైవేటు రంగ పెట్టుబడులకు అవకాశం కల్పించడం ద్వారా నగరాభివృద్ధికి బాటలు వేసింది. దీంతో కురుక్షేత్ర రూపురేఖలే మారిపోయాయి. నిత్యం ఇక్కడకొచ్చే పర్యాటకులు నాలుగేళ్లతో పోల్చుకుంటే రెట్టింపును మించిపోయారు. హరియాణాలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కురుక్షేత్ర ఒకటి. మే 12న జరిగే ఎన్నికలో ఈ నగరాభివృద్ధి బీజేపీకి ఒక అనుకూలాంశమైంది.

హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా వున్న నయాబ్‌ సింగ్‌ సైనీ.. ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌ చౌతాలా కుమారుడైన 26ఏళ్ల అర్జున్‌ చౌతాలాతో తలపడుతున్నారు. మాజీ మంత్రి నిర్మల్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పోటీకి పెట్టింది.   ఈ నాలుగేళ్ళలో కురుక్షేత్ర స్వచ్ఛ నగరంగా మారింది.  మల్టీప్లెక్సులు నగరానికి సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. బహుళజాతి బ్రాండెడ్‌ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. దీంతో నగరం పర్యాటకంగా అభివృద్ధి అవుతోంది.. అంటున్నారు యువతీయువకులు. ఈ నియోజకవర్గంలోని సోనిపట్, పానీపట్, కర్నాల్‌లో కురుక్షేత్ర తరహా మార్పులు కనిపించకపోయినా, అక్కడి యువత కూడా మోదీపైనే మొగ్గు చూపుతోంది. కురుక్షేత్రలో వెనుకబడిన కులాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2016లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్లు జరిపిన ఆందోళనతో ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రమైంది.

మరిన్ని వార్తలు