రేపే లోక్‌సభ ఎన్నికల పోరు

10 Apr, 2019 02:02 IST|Sakshi

ముగిసిన ఎన్నికల ప్రచార ఘట్టం..  

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్‌ 

ఓటేయనున్న 2,97,08,599 మంది ఓటర్లు  

బరిలో 443 మంది అభ్యర్థులు 

34,604 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు 

ఎన్నికల విధుల్లో 2.5 లక్షల మంది సిబ్బంది 

చివరి రోజు భారీ ప్రలోభాలకు రంగం సిద్ధం 

సాక్షి, హైదరాబాద్‌: తొలి దశ లోక్‌సభ ఎన్నికలు రేపే జరగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు సహా 20 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తెలంగాణలోని 16 స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో, అక్కడ పోలింగ్‌ ప్రారంభానికి ముందు గంట పాటు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో నిజామాబాద్‌లో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు రాష్ట్రంలోని 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. ఐదు స్థానాల్లో బీఎస్పీ, చెరో రెండు స్థానాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఒక స్థానం (హైదరాబాద్‌) నుంచి ఎంఐఎం పోటీ చేస్తోంది.

17 స్థానాల నుంచి మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు కలిపి మొత్తం 2,96,97,279 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 10975 మంది పురుషులు, 346 మంది మహిళలు కలిపి మొత్తం 11,320 మంది సర్వీసు ఓటర్లు వీరికి అదనం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఓటేయనున్న వారి సంఖ్య 2,97,08,599కు చేరనుంది. ఓటర్లందరికీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం మంగళవారం ప్రకటించింది. 34,604 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2.5 లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారు. పోలింగ్‌ సిబ్బంది బుధవారం ఉదయం స్థానిక డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి చేరుకుని, అక్కడి నుంచి ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని అదే రోజు రాత్రి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. 77,365 బ్యాలెట్‌ యూనిట్లు, 41,051 కంట్రోల్‌ యూనిట్లు, 43,894 వీవీప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. 

పోలింగ్‌ కేంద్రం తెలుసుకోండిలా.. 
- 9223166166 నంబర్‌కు ‘TS VOTE VOTERID NO’నమూనాలో ఎస్‌ఎం ఎస్‌ పంపితే మొబైల్‌ ఫోన్‌కు పోలింగ్‌ కేంద్రం చిరునామా వస్తుంది. (ఉదాహరణకు ‘ TS VOTE AB-C1234567’). 
- 1950 నంబర్‌కు ‘ ECI VOT-ER-ID N’నమూనాలో ఎస్సెమ్మెస్‌ పంపి తెలుసుకో వచ్చు. (ECI ABC-1234567). 
- స్మార్ట్‌ ఫోన్‌లో నాఓట్‌ (Naa Vot-e) యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసి లొకేషన్‌ చెక్‌చేసుకోవచ్చు.  
- 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసినా కూడా తెలుసుకోవచ్చు. 

కట్టలు తెంచుకున్న పంపిణీ 
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల అభ్యర్థులు సర్వశకులూ ఒడ్డు తున్నారు. పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉండటంతో  వ్యూహా లకు పదునుపెట్టారు. బూత్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాట్లు చూసుకుంటూనే, ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెల్లారితే పోలింగ్‌ కావడంతో పోటాపోటీగా డబ్బులు, మద్యం, కానుకలతో ఓటర్లను ముంచేస్తున్నారు. రూ.54.55 కోట్ల నగదు పట్టుబడగా, రూ.9.37 కోట్లు గత 24 గంటల్లో పట్టుబడింది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి ప్రాంతాల వారీగా ఓటర్లకు భారీ తాయిలాల పంపిణీకి రంగం సిద్ధమైంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సికింద్రాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్‌గిరి స్థానాల్లో ఒక్కో ఓటరుకు రూ.2 వేల వరకు పంచుతున్నట్లు తెలిసింది. పోలింగ్‌ రోజు కీలకమైన బూత్‌ మేనేజ్‌మెంట్లలో లోటుపాట్లకు తావు లేకుండా ప్రధాన రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. బూత్‌ స్థాయి కమిటీలతో సమావేశమై పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తతతో వ్యవహరించా ల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు, పోలింగ్‌ జరిగే సమయం, పోలింగ్‌ ముగిశాక చేయాల్సిన పనులను పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లకు నూరిపోస్తున్నారు. 

మరిన్ని వార్తలు