ప్రచారం.. పట్టణాలకే పరిమితం!

7 Apr, 2019 12:35 IST|Sakshi
ప్రచారంలో భాగంగా కథలాపూర్‌ రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ (ఫైల్‌) 

సాక్షి, కథలాపూర్‌(వేములవాడ): నిన్న..మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో రాజకీయపార్టీల ప్రచారం అంతా.. ఇంతా కాదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలైతే చిన్నపాటి యుద్ధంలాగే సాగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రిజిస్టర్డ్‌ పార్టీలు, స్వతంత్రులు సైతం తమ ప్రచారాన్ని మండల కేంద్రాలకే పరిమితం చేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదు. కొందరికైతే ఎవరెవరూ పోటీ చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదు.  

గడువు దగ్గరపడుతున్నా.. 
నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో తమ రోడ్‌షోలు.. బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలైన మండల కేంద్రాల్లోనే నిర్వహిస్తుండడంతో గ్రామీణులకు ఎన్నికల సందడి తెలియడం లేదు. ఎంపీగా బరిలో ఉన్న అభ్యర్థులు మండలానికి ఒక్కసారి వచ్చి రోడ్‌షోలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రచారానికి గడువు ఈనెల  9వ తేదీతో ముగియనుండడంతో అభ్యర్థుల ప్రచారం గడపగడపకూ చేరకపోవడంతో ప్రజల్లో చర్చానీయాంశంగా మారింది. ఎంపీ అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లోని ద్వితీయశ్రేణి నేతలపైనే తమ ప్రచారం భారం వేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదని రాజకీయనాయకులు చర్చించుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో కనిపించడం లేదు.   

అసెంబ్లీకి పోటాపోటీ ప్రచారం  
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం సైతం అదేస్థాయిలో ఉండేది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించింది. కానీ నేటి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలు, వివిధ యూత్‌ అసోసియేషన్లతో మండలకేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనే సమావేశమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.  

దొరకని ఓటరు నాడి 
అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు ఉంటున్నారో స్పష్టంగా తెలిసింది. కానీ ఎంపీకి ఎటో ఓటు వేస్తారో తెలియడం లేదు. గ్రామాల్లో ప్రచారం లేకపోవడంతో గ్రామీణులు ఓట్లు ఎటూ వేయాలో తేల్చుకోవడం లేదు. ఏదేమైనా గత ఎన్నికల కన్నా విభిన్నంగా ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారం లేకపోవడంతో పల్లెవాసుల్లో ఎన్నికల ముచ్చట్లు వినిపించడం లేదు.   

మరిన్ని వార్తలు