‘అంబేద్కర్‌కి మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు’

26 May, 2018 17:15 IST|Sakshi
ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహుజా

జైపూర్‌: బీజేపీ నేతల మాటలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మతతత్వ పార్టీ అంటూ బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. నాయకుల అనుచిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజస్థాన్‌ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘తమని ఆదివాసీలుగా చెప్పుకొనే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆయన కంటే ముందుగా హనుమాన్‌ని పూజించాలి. ఎందుకంటే, ఆదివాసీల మొదటి నాయకుడు హనామన్‌ జీ మాత్రమే.వారంతా ఆయనకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. వారి మొదటి దేవుడు హనుమాన్‌. దళితులకు మార్గ నిర్దేశం చేసింది హనుమానే’ అని అహుజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కార్యాలయంలో గల అంబేద్కర్‌ విగ్రహం కింద హనుమాన్‌ చిత్రపటం ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుణ్ని అవమానించారని మండిపడ్డారు. ‘మీరు సిగ్గు పడాలి. మీరంతా ఆదివాసీలమని చెప్పుకొంటూనే హనుమాన్‌ని అవమానిస్తారా..!’ అని స్థానిక ఎంపీ కిరోడి లాల్‌ మీనాపై అహుజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయస్వామికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 40 లక్షల దేవాలయాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరే దేవుడికి ఇన్ని ఆలయాలు లేవని తెలిపారు.

అహుజా వ్యాఖ్యలపై ఎంపీ కిరోడిలాల్‌ స్పందించారు. ‘ హనుమాన్‌ కాలంలో ఇటువంటి రాజకీయాలు లేవు. అహుజా హనుమాన్‌ జీని ఆదివాసీ, దళిత నాయకుడు అని అనాల్సిన అవసరం ఏమొచ్చిందో అంతుచిక్కడం లేద’ని ఆయన అన్నారు. ‘హనుమాన్‌కి అవమానం జరిదిందని విన్నాను. ఇది చాలా విచారకరం. అలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను కించపరుస్తాయి. అయినా, ఈ ఘటనకు ఆదివాసీలను బాధ్యులను చేయాల్సిన అవసరం లేద’ని అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా