Elections 2024: ముందస్తు ఎంపిక వెనుక

19 Aug, 2023 05:37 IST|Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే అభ్యర్థుల ఖరారు 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ ప్రాంతాలపై బీజేపీ గురి 

బలహీనంగా ఉన్న స్థానాల్లో బలం పెంచుకునే వ్యూహం 

ఇంకా ఎన్నికల వేడి రాజుకోలేదు.. నోటిఫికేషన్‌ నగారా మోగలేదు అయినా బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికల కసరత్తు ముందుగానే ప్రారంభించింది.   మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కమలనాథులకు ఎందుకీ తొందర? అభ్యర్థుల ఎంపిక వెనుక వ్యూహమేంటి?  

భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూ­రించింది. మధ్యప్రదేశ్‌లో 39 మందితో, ఛత్తీస్‌గఢ్‌లో 21 మందితో తొలిజాబితా విడుదల చేసి ప్రత్యర్థి పార్టీల్లో ఎన్నికల వేడి పెంచింది.

వచ్చే ఏడాది జరిగే లోక్‌ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌ గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ) రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ ముందస్తుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్‌ నియోజకవర్గం నుంచి ఆయన సమీప బంధువు, బీజేపీ ఎంపీ విజయ్‌ భగేల్‌ను రంగంలోకి దింపి ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందనే సంకేతాలు పంపింది. గతంలో ఒకసారి భూపేష్‌ భగేల్‌ను ఓడించిన ఘనత విజయ్‌కు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా తదితరులు హాజరైన బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలోనే ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలన్న నిర్ణయానికొచ్చారు.  

సీట్లలో ఏబీసీడీ వర్గీకరణ
అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందు అసెంబ్లీ స్థానాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించింది. 

గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు – ఏ కేటగిరీ 
మిశ్రమ ఫలితాలు వచి్చన స్థానాలు – బీ కేటగిరీ 
బలహీనంగా ఉన్న స్థానాలు – సీ కేటగిరీ 
ఇప్పటివరకు గెలవని స్థానాలు – డీ కేటగిరీ 
సీ, డీ కేటగిరీ సీట్లపై దృష్టి సారించిన కమలనాథులు ఆయా సీట్లకే తొలి జాబితా విడుదల చేశారు.  

ఆదివాసీ ప్రాంతాలే గురి  
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ పాగా వెయ్యలేకపోయింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్‌కే పట్టు ఉంది. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ముందస్తుగా కసరత్తు పూర్తి చేసి బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించిన 21 స్థానాల్లో 10 ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడినవే. ఇక మధ్యప్రదేశ్‌ విషయానికొస్తే 13 స్థానాలు ఎస్‌టీ రిజర్వ్‌ సీట్లు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయడానికి వీలుగా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలే  
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికలు బీజేపీకి చేదు ఫలితాల్నే మిగిల్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ఇక మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గాను 109 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 114 సీట్లతో మెజారీ్టకి ఒక్క సీటు దూరంలో మిగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదనే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముందస్తుగా మొదలు పెట్టింది.

అంతర్గత సర్వేలు ఏం చెబుతున్నాయి ?  
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అంతర్గత సర్వేలు కాస్త ఆందోళన పుట్టించేలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 40% మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వెల్లడైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు గాను 30 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముందని సర్వేలో తేలింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో బీజేపీ ఇక ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అత్యంత కీలకమైన హిందీబెల్ట్‌లో ఒక్క రాష్ట్రంలో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన పార్టీ అగ్రనాయకుల్లో ఉంది.  

ముందస్తు జాబితాతో మేలే  
బీజేపీ అగ్రనాయకులు ఎంతో కసరత్తు చేసి తాము బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వ్యూహంలో భాగమే. అభ్యర్థులు నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించి ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.’’అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.  అయితే ఇలా ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల రెబెల్స్‌ బెడద కూడా ఉంటుంది. ఆ రిస్క్‌ తీసుకొని మరీ కమలనాథులు ముందడుగు వేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు