కలిసుంటే మరో 10 సీట్లు

26 May, 2019 05:21 IST|Sakshi

యూపీలో విపక్షాల అనైక్యతకు ఫలితం

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్‌ బంధన్‌)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్‌ఎల్‌డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్‌ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్‌కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్‌ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

కూటమిలో కాంగ్రెస్‌ ఉంటే ఫలితం మరోలా..
మహా కూటమిలో కాంగ్రెస్‌ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్‌లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్‌ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్‌ చరణ్‌ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్‌ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామ్‌ సాగర్‌ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు  ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తనూజ్‌ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్‌ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్‌ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్‌లో బీఎస్పీ అభ్యర్థి రామ్‌ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ మద్దతిచ్చిన జన్‌ అధికార్‌పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి.

ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్‌లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్‌ కబీర్‌ నగర్, సుల్తాన్‌పూర్‌ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్‌ కలిస్తే  ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్‌ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్‌పూర్‌లో  బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు