ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి: శివసేనకు ఆహ్వానం

10 Nov, 2019 20:33 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు

శివసేనకు గవర్నర్‌ ఆహ్వానం

ఉత్కంఠగా మహా రాజకీయాలు

సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. కొద్ది సమయం వ్యవధిలోనే అనేక కీలక పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా లేమని బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శివసేనను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం 7:30లోపు అసెంబ్లీలో బలాన్ని  నిరూపించుకోవాలని గడవు విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీంతో వ్యూహాల రచనకు శివసేన మరింత పదునుపెట్టింది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ నుంచి పిలుపు రావడంతో మహా రాజకీయం ఒక్కసారిగి వేడెక్కింది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో మంతనాలు చేసేందుకు శివసేన నేతలు రంగంలోకి దిగారు. దీని కొరకే శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు రాత్రి అక్కడ కాంగ్రెస్‌, ఎన్సీపీ కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరనున్నారు. అయితే శివసేన ఆహ్వానంపై స్పందించిన ఎన్సీపీ.. పలు షరతులు విధించింది. అసెంబ్లీ బలపరీక్షలో మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని కండీషన్‌ పెట్టింది. అలాగే ప్రభుత్వం కేంద్రంలోని అన్ని పదవులకు సేన నేతలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల బలం ఉండాలి. దీంతో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిస్తే.. సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ దిశగానే శివసేన ప్రణాళికలు రచిస్తోంది. అయితే దీనిపై ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల స్పందన ఏ విధంగా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది.


 

మరిన్ని వార్తలు