అయ్యర్‌ అదరహో.. బంగ్లా లక్ష్యం 175

10 Nov, 2019 20:54 IST|Sakshi

నాగ్‌పూర్‌ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన చివరి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో బంగ్లాకు టీమిండియా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా.. అయ్యర్‌ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో మనీశ్‌ పాండే(22 నాటౌట్‌; 13 బంతుల్లో 3ఫోర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షఫీల్‌ ఇస్లామ్‌, సౌమ్య సర్కార్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అల్‌ అమీన్ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.

ఆదిలోనే షాక్‌
టాస్‌ గెలిచిన బంగ్లా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగలింది. గత మ్యాచ్‌ హీరో రోహిత్‌ (2)ను షఫీల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం ధావన్‌(19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును ఆదుకునే బాధ్యత అయ్యర్‌, రాహుల్‌లపై పడింది. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఒక్కసారి క్రీజులో సెటిల్‌ అయ్యాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇదే క్రమంలో రాహుల్‌ అర్దసెంచరీ సాధించాడు. ఇక రాహుల్‌ ఔటయ్యాక అయ్యర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. అఫిఫ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు భారీ సిక్సర్లు సాధించాడు. దీంతో టీ20ల్లో తొలి అర్దసెంచరీ సాధించాడు. మరోవైపు పంత్‌(6) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.  ఇక అయ్యర్‌ నిష్క్రమణ తర్వాత పాండే తన బ్యాట్‌కు పనిచెప్పడంతో బంగ్లాకు టీమిండియా మంచి స్కోర్‌ నిర్దేశించగలగింది. 

>
మరిన్ని వార్తలు