జగన్‌తో భేటీ అద్భుతం

27 May, 2019 02:13 IST|Sakshi
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చర్చలు ఫలవంతమయ్యాయి.. ప్రధాని మోదీ ట్వీట్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అద్భుతంగా జరిగిందని, చర్చలు ఫలవంతంగా సాగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్‌లో ఆంగ్లం, తెలుగు భాషల్లో ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వై.ఎస్‌. జగన్‌తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై మా మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఆయన పరిపాలనా కాలంలో సాధ్యమైనంత మేరకు అన్ని విధాలా కేంద్రం మద్దతునిస్తుంది. సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధానిని జగన్‌ కలిసిన కొద్ది సేపటి తర్వాత ఈ విధంగా ట్వీట్‌ చేయడం విశేషం. రాష్ట్రం పట్ల కేంద్రం సానుకూలంగా ఉండగలదన్న సంకేతం ఈ ట్వీట్‌ ద్వారా వెల్లడైందని భావిస్తున్నారు. 

రాష్ట్రాన్ని ఆదుకోండి..
ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాక ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఆర్థిక స్థితిగతులు, వివిధ అర్జీల స్థితిపై చర్చించారు. అనంతరం వైఎస్‌ జగన్‌  10.10 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.45 గంటలకు లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు.

నరేంద్ర మోదీ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతూ అక్కున చేర్చుకుని ప్రేమగా వెన్నుతడుతూ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడలో ఈనెల 30న తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్‌.. ప్రధానిని ఆహ్వానించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితిని జగన్‌ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి జీవరేఖ కానున్న ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరారు. 

గంట పాటు సాగిన సమావేశంలో అన్ని విషయాలను సావధానంగా విన్న ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత మేరకు కేంద్రం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు పలువురు ప్రముఖులు సాయంత్రం ముఖ్యమంత్రి అధికారిక నివాసం 1 జన్‌పథ్‌లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, పారిశ్రామిక వేత్తలు కుమార మంగళం బిర్లా, నవీన్‌ జిందాల్, పునీత్‌ దాల్మియా తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా రాం మాధవ్‌ తెలిపినట్టు సమాచారం. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆద్యంతం ఉత్సాహం.
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. ప్రధాన మంత్రితో సమావేశం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో సాగగా.. తదుపరి మీడియా సమావేశంలోనూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. జగన్‌ వెంట ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాలశౌరి, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, నందిగం సురేశ్, మార్గాని భరత్‌ ఉన్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్, ఓఎస్డీ భావనా సక్సేనా పర్యవేక్షించారు.


మోదీకి జ్ఞాపిక అందిస్తున్న వైఎస్‌ జగన్, చిత్రంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ ఎంపీలు నందిగం సురేశ్, బాలశౌరి, భరత్, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి

హోదా ఇవ్వాలని ప్రధానిని ఒప్పించండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం 12 గంటలకు మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రత్యేక హోదా అమలుపై ప్రధాన మంత్రిని ఒప్పించాల్సిన అవసరాన్ని విడమరిచి చెప్పారు. ఈనెల 30న జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత నేరుగా ఏపీ భవన్‌ చేరుకుని అక్కడ వివిధ రాష్ట్రాల కేడర్లలో పని చేస్తున్న ఏపీకి చెందిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, ఏపీ కేడర్‌ అధికారులు, ఏపీ భవన్‌ అధికారులు, ఢిల్లీలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, తెలుగు ప్రజలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వారంతా జగన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌. చిత్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

మరిన్ని వార్తలు