హంగ్‌ రాలేదు.. ఎంఐఎం స్థానాలూ మారలేదు!

11 Dec, 2018 18:09 IST|Sakshi
అక్బరుద్దీన్‌ ఓవైసీ

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీలో తమను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఏ పార్టీకి లేవనీ, అందరు సీఎంలు తమకు సలాం కొట్టినవారేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తమ్ముడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ఎన్నికలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్‌ వస్తే ఎంఐఎందే కీలక పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు. కానీ, ఆయన ఆశలు నెరవేరలేదు. తెలంగాణలో హంగ్‌ రాలేదు. అలాగనీ ఎంఐఎం గెలిచిన స్థానాల్లో కూడా పెద్దగా మార్పు లేదు. ఎప్పటిలాగే తన కంచుకోట హైదరాబాద్‌ పాతబస్తీలో ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. ఈసారి నగర శివారు నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లో పోటీ చేసి.. ఉత్కంఠ రేపినప్పటికీ.. అక్కడ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మరోసారి విజయం సాధించారు. కానీ, ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఎంఐఎం రెండోస్థానంలో నిలువడం గమనార్హం.

ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌స్‌కే పట్టం కట్టడంతో.. ఎంఐఎంకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. టీర్‌ఎస్‌కే తమ పూర్తి మద్దతు ఉంటుందని అసదుద్దీన్‌ ఇదివరకే ప్రకటించారు. అయితే, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఆలోచించిస్తానని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కేసీఆర్‌ను కలిసిన ఆయన తమ పార్టీ టీఆర్‌ఎస్‌కే అనుకూలమని విస్పష్ట సంకేతాలు పంపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం.. తమ పనులు చేయించుకోవడం ఆది నుంచి ఎంఐఎం అనవాయితీగా పెట్టుకుంది. గత హయాంలో కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఎంఐఎం ఈసారి కూడా అలాగే వ్యవహరించే అవకాశముంది.

ఎంఐఎం గెలుపొందిన స్థానాలు..
మలక్‌పేట: అహ్మద్‌ బలాల, నాంపల్లి: జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌, చార్మినార్‌: ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్‌ ఓవైసీ, యాకుత్‌ పురా: అహ్మద్‌ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్‌ మౌజంఖాన్‌,  కార్వాన్‌: కౌసర్‌ మొహినుద్దీన్‌  స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్‌ చేతిలో మీర్జా రహమత్‌ బైగ్‌ పరాజయం పాలయ్యారు.

మరిన్ని వార్తలు