ఆముదాలవలసలో అవినీతి రాజ్యం : వైఎస్‌ జగన్‌

11 Dec, 2018 18:11 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఆముదాలవలసలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 319వ రోజు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌.. ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా..
‘చంద్రబాబు సీఎం కాగానే ఆముదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్లింది. ఆదుకోవాల్సిన చంద్రబాబు షుగర్‌ ఫ్యాక్టరీని రూ. 6.40 కోట్లకు కావాల్సిన వారికి అమ్ముకున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. రైతులంతా కోర్టు మెట్లు ఎక్కితే.. హైకోర్టు ఆపమని ఆర్డరిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. మళ్లీ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ కేసును సుప్రీం నుంచి ఉపసంహరించారు. 2014 ఎన్నికల్లో ఆ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి ఆ హామీని నిలబెట్టుకోలేదు. మీ అందరి దీవెనెలతో అధికారంలోకి రాగానే  ఆ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాను. అవినీతిలో చంద్రబాబు డాన్‌ అయితే.. ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడున్న ఎమ్మెల్యే చోటా డాన్‌. జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఈ దోపిడీ బయటకు తెలియజేయడానికి వంశధార నది ఉగ్రరూపం దాల్చి వరదతో ముంచెత్తింది. అక్రమంగా ఇసుకు తీసుకెళ్లడానికి ఉన్న లారీలు, జేసీబీలు.. నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ఇసుక లూటీ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయినా ఆ లూటీ చేసిన ఎమ్మెల్యే, చిన్నబాబుల మీద ఏలాంటి చర్యలుండవు.

ఖాళీ స్థలం కనబడితే పాపం..
కొత్త ఉద్యోగాల గురించి దేవుడెరుగు, ఉ‍న్న ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనబడితే కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆముదాలవలస పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న ప్రభుత్వస్థలాన్ని కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టాలని చూస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ ఆందోళన చేయాల్సి వచ్చింది. వంశాధార, నాగవళి అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ తర్వాత కరకట్టల నిర్మాణం కోసం కనీసం చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదు. నారయణపురం ఆనకట్టతో 37 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. శిథిలావస్థకు చేరిన ఆనకట్టను పునర్‌ నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఆనకట్ట పునర్‌నిర్మాణం కనిపించిందా?

చంద్రబాబు పాలనలో అంతా మోసం..
తిత్లీ తుపాన్‌ వస్తే రూ. 3435 కోట్ల నష్టమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. బాధితుల కోసం చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ. 520 కోట్లేనని, బాధితులను పూర్తిగా ఆదుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. నిజంగా తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకున్నారా? జాబు రాకుంటే నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు రూ. 1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో రైతులను దగా చేశారు. డీలర్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మెలను మోసం చేశారు. ఆరోగ్య శ్రీని పాతరేశారు. జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని దోచేస్తున్నాయి. ఆముదాలవలస నియోజవర్గంలో పెన్షన్లలో అక్రమాలు పెరిగాయి. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలంటే మీ సహకారం కావాలి.’ అని అధికారంలోకి రాగానే నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు