-

‘చంద్రబాబు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేయ్యాలి’

17 Jul, 2019 12:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాల అన్నింటికీ నోటీసులు ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అక్రమ కట్టడాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నదిపరివాహ ప్రాంతంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన 26 భవనాలకు ఇప్పటికే నోటీసులు పంపామని, చట్టం ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజావేదిక తొలగింపుపై టీడీపీ నేతలు అర్థరాత్రి హడావుడిగా కోర్టుకు వెళ్లినా.. అక్రమ నిర్మాణంగా కనుక కోర్టు జోక్యం చేసుకోలేదన్నారు. లింగమనేని రమేష్‌ గెస్ట్‌ హౌస్‌ కచ్చితంగా అక్రమ కట్టడమేనని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని, చట్టం ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు