ఆంధ్రజ్యోతి ఫేక్‌ సర్వే.. మండిపడ్డ మిషన్‌ చాణక్య

8 Apr, 2019 22:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అవకాశముందని కార్పొరేట్‌ చాణక్య పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం ఓ దొంగ సర్వేను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు ఈ సారి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని తెలిసిపోయిన చంద్రబాబు ఈ తోకపత్రిక సాయంతో సర్వే డ్రామాలకు తెరతీశాడు. దాంతో ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య పేరును పోలి ఉండేవిధంగా ‘కార్పొరేట్‌ చాణక్య’  అనే ఫేక్‌ సర్వే సంస్థ పుట్టుకొచ్చింది. ఏకంగా టీడీపీకీ 101 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. ఇక తమ పేరును బద్నాం చేసిన ఆంధ్రజ్యోతి పత్రికపై మిషన్‌ చాణక్య మండిపడింది. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్‌ రికార్డును సైతం కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని వెల్లడించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

మా అంచనా తప్పలేదు..
టీడీపీకి 101 సీట్లు అంటూ సర్వే పేరుతో సోమవారం నాటి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంలో.. మా సంస్థ ‘మిషన్‌ చాణక్య’ పేరును దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సంస్థకున్న ప్రతిష్టను దిగజార్చేలా .. కార్పొరేట్‌ చాణక్య అనే మారుపేరును సృష్టించడం అభ్యంతరకరం. మిషన్‌ చాణక్యకున్న ట్రాక్‌రికార్డును.. కొర్పొరేట్‌ చాణక్య అనే లేని సంస్థకు ఆపాదించడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్‌ రికార్డు వాస్తవానికి మిషన్‌ చాణక్యదని స్పష్టం చేస్తున్నాం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మా సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ ఉంది. కర్ణాటకలో బీజేపీ సీట్లను ఖచ్చింతంగా అంచనా వేసిందీ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చే సీట్లను ఖచ్చితంగా అంచనా వేసింది కూడా మిషన్‌ చాణక్య మాత్రమే... కార్పొరేట్‌ చాణక్య కాదు అని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

ఏపీలో ఎవరు గెలిచేది కూడా చెప్తాం..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలకుసంబంధించి కూడా మేము సర్వే నిర్వహిస్తున్నాం. కానీ మిషన్‌ చాణక్య తన ప్రస్థానంలో ఎప్పుడూ ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించలేదు. కర్ణాటకలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్నికల నియమావళికి అనుకూలంగానే ఒపీనియన్‌ పోల్స్‌ను, ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేసింది మిషన్‌ చాణక్య. ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చివరి ఫేజ్‌ ఎన్నికల తర్వాత విడుదల చేసేందుకు మేం సిద్ధమవుతున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికలో అచ్చయిన సమాచారం మాది కాదని ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఈ మేరకు తప్పడు పేరుతో వార్తను ప్రచురించడం చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేస్తున్నాం.

(చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్‌)

మరిన్ని వార్తలు