భోగాపురం నుంచి బాత్‌రూం వరకు..

21 Aug, 2018 17:05 IST|Sakshi
సోము వీర్రాజు

టీడీపీ అవినీతిపై సోమువీర్రాజు ఫైర్‌

భోగాపురం టెండర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం నుంచి బాత్‌రూం వరకు టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. భోగాపురం మిమానాశ్రయం నిర్మాణ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్‌ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ప్రైవేట్‌ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను పాల్గొనకుండా సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్‌ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే  ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్‌ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు.

మరిన్ని వార్తలు