16 సీట్లు గెలిస్తే మనదే కీ రోల్‌

25 Mar, 2019 08:29 IST|Sakshi
సిరికొండలో మహిళా రైతుల సమస్యలు వింటున్న ఎంపీ కవిత

సిరికొండ: రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే దేశంలో మనమే కీరోల్‌ పోషిస్తామని నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. 16 ఎంపీ స్థానాలను గెలిచి మనం సీఎం కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తే.. ఆయన 116 మంది ఎంపీల మద్దతు సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతాడన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎంపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలో తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేశారో, దేశాన్ని కూడా ఆవిధంగా అభివృద్ధి చేసే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉందన్నారు. బీడీ కార్మికులు దేశమంతటా ఉన్నా ఒక్క తెలంగాణలోనే కార్మికులకు పింఛను వస్తుందని తెలిపారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయలేదని, ఆ రెండు పార్టీలు లేని దేశం కోసం ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. చిన్న చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని, ఎన్నో అవకాశాలు ఉన్న మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు.

సిరికొండ మండలానికి సాగు నీరు వచ్చే పైపులైన్‌ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ రూ.2600 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.  పెంచిన పింఛన్లు మే నెల నుంచి అందుతా యని తెలిపారు. అటవీ భూముల సమస్యను కేసీఆర్‌ త్వరలోనే పరిష్కరిస్తారని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. మీ ఎమ్మెల్యే, నేను ఇద్దరం చాలా మొండి వాళ్లమని, ఇద్దరం మొండితనంతో మీకు అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు.

పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తానని ఎంపీ రైతులకు భరోసా ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కవిత అభ్యర్థించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి.గోవర్ధన్‌ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఓట్ల కోసం కొందరు పగటి బిచ్చగాళ్లు వస్తారని, వాళ్లను ఎవరూ నమ్మవద్దని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఆనంద్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సుమనారెడ్డి, ఎంపీపీ మంజుల, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజన్న, జెడ్పీటీసీ సుజా, సిరికొండ సర్పంచ్‌ రాజారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జాగృతి మండల కన్వీనర్‌ శ్రీనివాస్,  పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు