రాజకీయ చవటాయలు!

26 Apr, 2019 19:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘వెన్‌ దే గో లో, వియ్‌ గో హై’ అని మాజీ అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామా 2016లో జాతీయ ప్రజాస్వామిక సమ్మేళనంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన నాటి వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాను విపరీతంగా ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియా ఆమె ప్రసంగం పట్ల ప్రశంసలు కురిపించింది. వైరిపక్షం వారు దిగజారి మాట్లాడితే తాము మాత్రం అంతకంతకు ఉన్నతంగా మాట్లాడుతామన్నది ఆమె వ్యాఖ్యల్లోని భావం. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని చూస్తుంటే ‘మీరు దిగజారి మాట్లాడితే మేం అంతకన్నా దిగజారి మాట్లాడుతాం’ అన్నట్లు ఉంది. 

ఆమె ఖాకీ కట్‌ డ్రాయర్‌ వేసుకుందని బీజేపీ నాయకురాలు జయప్రదను ఉద్దేశించి ఆజం ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ తనకు ఓట్లు వేయని వారిని పక్కన పెడతానని, తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను అందించడంటూ బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌ చేశారు. అదే పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వం రిజిస్ట్రీ ప్రకారం హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతస్థులను మినహా దేశానికి వలస వచ్చిన మిగతా వారినందరిని దేశం నుంచి వెళ్లగొడతామని బెదిరించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఆయన మాట్లాడినట్లు స్పష్టం అవుతూనే ఉంది. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. మరి, అందుకు ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. 

ఇక వ్యక్తిగతంగా ఒకరినొకరు దూసుకోవడం మరీ ఎక్కువైంది. ఒకరిని ఉద్దేశించి ‘పప్పూ’ అంటే, మరొకరిని ఉద్దేశించి ‘నామ్‌దార్‌’ అనడం, ‘స్పీడ్‌ బ్రేకర్, ఎక్స్‌పయరీ బాబు, బాటిల్‌ ఆఫ్‌ పాయిజన్‌’ తదితర పదాలను వాడుతూ తమ క్రియేటివిటీ పోటీపడి చాటుకుంటున్నారు. తాము పార్టీలకు సారథ్యం వహిస్తున్న రాజకీయ నాయకులమని, తాము ప్రజల దష్టిలో ఆదర్శప్రాయంగా ఉండాలన్న ధ్యాసే వారిలో కనిపించడం లేదు. వారిలో ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఆలోచనకన్నా ప్రత్యర్థులను మరింత బాగా తిట్టాలన్న ధోరణే కనిపిస్తోంది. పార్టీల సిద్ధాంతాలను, ఎన్నికల ప్రణాళికల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన వారు వాటిని పూర్తిగా విస్మరించి తిట్ల దండకం అందుకుంటున్నారు. రేపు అధికారంలోకి వస్తే ప్రజలు ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించిగానీ, ఎన్నికల ప్రణాళికల గురించిగా అడగకూడదన్నది వారి ఉద్దేశమా! ఉన్నతంగా మాట్లాడే సంస్కృతి వారికి లేదా? ఏదయితేనేం, ‘చవటాయను నేనంటే నీకంటే చవటాయను నేను’ అన్నట్లు ఉందని వారికి ఎప్పుడు అర్థం అవుతుందో!?

మరిన్ని వార్తలు