-

దీపావళి వేడుకల్లో ములాయం కుటుంబం

20 Oct, 2017 08:45 IST|Sakshi

సాక్షి, లక్నో : ఈ దీపావళి పండగ ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో.. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీలో కొత్త వెలుగులు నింపింది. ఏడాదిన్నర కాలంగా అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్‌ ఒక్క తాటిపైకి వచ్చింది. ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబం మొత్తం కలుసుకుని వేడుకలో పాల్గొనటంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించింది. 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి గురువారం అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి సైఫై నిలయంలో సందడి చేశారు. తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. కాసేపటికే శివపాల్ అక్కడికి చేరుకోగా.. అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో శివ్‌పాల్ అబ్బాయిని ఆశీర్వదించగా.. ఈ దృశ్యంతో అక్కడున్న మిగతా పార్టీ నేతల ముఖంలో  ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి. ములాయం ఇంట ముసలం, ఆపై  యూపీ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత తండ్రి.. బాబాయ్, అబ్బాయ్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి.

బుధవారమే సైఫై నిలయానికి చేరుకున్న అఖిలేశ్‌ కుటుంబం అంతకు ముందు అక్కడికి చేరుకున్న మరో బాబాయ్‌ రాంగోపాల్‌ యాదవ్‌తో సరదాగా గడిపారు. అయితే ఆ కాసేపటికే ములాయం కూడా అక్కడికి చేరుకుని రాంగోపాల్‌ యాదవ్‌తో ఏకాంతంగా రాజకీయాలపై చర్చించారంట. ఇక ఈ దీపావళితో తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని ములాయం ప్రకటించారు. పార్టీ-కుటుంబం ఇప్పుడు అంతా ఒక్కట్టే. అంతా కలిసి పార్టీని బలోపేతం చేసి.. ఉన్నతస్థాయికి చేర్చేందుకు యత్నిస్తాం అని ములాయం చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసే దిశగా ములాయం కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది.

మరిన్ని వార్తలు