‘కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా...’

1 Jan, 2020 17:21 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన, దోపిడీ పాలన రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని అన్నారు. బుధవారం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా. నిరుద్యోగ భృతి ఎక్కడ? రుణమాఫీ ఎక్కడ? రైతు బంధు ఎక్కడ? మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ పార్టీని ఎండగడతాం. నేను మున్సిపల్‌ ఎన్నికల గురించి మాట్లాడితే నాపైన టీఆర్‌ఎస్‌ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. 

రిజర్వేషన్లు ముగిశాక నామినేషన్‌లకు వారం రోజుల గడువు ఇవ్వాలి. కేసీఆర్,మోదీ ఇద్దరూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారు. కేంద్రంలో మోదీ మతపరైన రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ వాళ్లను ఉపయోగించి కాంగ్రెస్ కార్యకర్తలను అణిచివేస్తున్నారు. అందుకు నిరసనగా త్వరలోనే జైల్ బరో నిర్వహిస్తాం. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాను. బడుగు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పార్టీ’అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు