కురువృద్ధుల తిరుగు బావుటా

6 Apr, 2019 11:43 IST|Sakshi

అడ్వాణీ బ్లాగ్‌ సందేశం..

మోదీ–షా ద్వయానికి అభిశంసనే!

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌.కె.అడ్వాణీ ఏళ్ల నిశ్శబ్దాన్ని వదిలేశారు. పార్టీని వ్యతిరేకించిన వాళ్లెవరూ దేశద్రోహులు కాబోరని ఓ బ్లాగ్‌లో తేల్చి చెప్పారు!. దీనికి మోదీ సహా అందరూ ప్రశంసల వర్షమూ కురిపించారు!. ఇంకేం.. అంతా బాగుంది అనుకుంటున్నారా?. అక్కడే వస్తోంది తేడా! అడ్వాణీ బ్లాగ్‌ ఓ గుప్త సందేశమని అంటున్నారు విశ్లేషకులు. ఆచితూచి.. తనలాంటి వారితో సంప్రదించి మరీ...అడ్వాణీ వేసిన ఈ పాచిక పారుతుందా?. ఇంతకీ ఈ బ్లాగు వెనుక ఉన్న సందేశం ఏమిటి?

నిండు సభా వేదికపై కనీసం ప్రతి నమస్కారం కూడా చేయకుండా మోదీ చేసిన అవమానాన్ని బీజేపీ కురువృద్ధుడు మరచిపోయారా? సుమారు అరవై ఏళ్ల ప్రజా జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. మార్గదర్శక్‌ మండల్‌కే పరిమితం చేసిన వారిని ఆయన క్షమించేశారా? మాట మాత్రం కూడా చెప్పకుండా తను ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ స్థానం నుంచి అమిత్‌ షా నామినేషన్‌ వేసినా.. పోనీలే అని ఊరుకున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. 91 ఏళ్ల అడ్వాణీ తనదైన శైలిలో పార్టీపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అనిపించకమానదు. రాజకీయ విశ్లేషకుల అంచనాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్‌ జోíషీకి  కూడా కాన్పూర్‌ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం అడ్వాణీని తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసిన బ్లాగ్‌.. అందులోని ప్రతి వాక్యానికీ ప్రాధాన్యం ఏర్పడిందని.. మరోవైపు మురళీ మనోహర్‌ జోషీ కూడా తనదైన శైలిలో తన అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు, తిరుగుబాటు చేసేందుకూ సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరితో చర్చలు జరిపిన ఆయన.. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తోనూ మాట్లాడారు. ఒకదశలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన వారణాసి నుంచి మోదీపై పోటీకి పెట్టేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. అయితే మోదీ కోసమని తాను 2014లో వదిలేసుకున్న ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు జోషీ నిరాసక్తత వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. వారణాసి కాకుండా ఇంకోచోటు నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్‌ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈ లోపుగా ఆయన కూడా మోదీ తరహా రాజకీయాలను ప్రశ్నిస్తూ అడ్వాణీ మాదిరిగా ఓ ఘాటు లేఖ/బ్లాగ్‌ పోస్టు లేదా ప్రత్యేక కథనాన్ని రాసే అవకాశముందని అంచనా. అడ్వాణీ తన బ్లాగ్‌లో దేశద్రోహులన్న అంశాన్ని ఎంచుకోగా.. జోషీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని లేవనెత్తనున్నారు.  ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సిద్ధం చేసిన బ్యాంక్‌ లోన్‌ ఎగవేతదారుల జాబితాను జోషీ ప్రస్తావించవచ్చు.

అది అభిశంసనే..
అడ్వాణీ తన బ్లాగ్‌ ద్వారా చెప్పిన కొన్ని అంశాలు నేరుగా మోదీ– అమిత్‌ షా తీరుకు అభిశంసనేనని విశ్లేషకులు అంటున్నారు. ‘తనకు తెలిసిన జాతీయవాదంలో విమర్శించే వారెవరినీ దేశద్రోహులుగా గుర్తించడం ఉండద’న్న వ్యాఖ్య ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా జాతీయవాదంపై చర్చ జరుగుతోన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పార్టీ సీనియర్‌ నేతలందరూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నింటిపై దేశద్రోహులనే ముద్ర వేసేలా మాట్లాడటాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అడ్వాణీ చేసిన తాజా వ్యాఖ్యతో ఈ వాదనను ప్రశ్నించినట్లు అయిందని వీరు అంటున్నారు. ఈమధ్యే అడ్వాణీ కొంతమంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో తన అసంతృప్తిని, ఆవేదనను పంచుకున్నారని మోదీ– షా ద్వయం తనను, జోషీని అవమానాలకు గురి చేసిందని అడ్వాణీ వాపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాన్పూర్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్న విషయం జోషీకి పార్టీ జనరల్‌ సెక్రటరీ రామ్‌లాల్‌ ద్వారా తెలియజేశారని, పోటీ చేయాలన్న ఆసక్తి లేదని బహిరంగ ప్రకటన చేయాలన్నది అమిత్‌ షా ఉద్దేశమని రామ్‌లాల్‌ స్వయంగా జోషీకి చెప్పగా.. ‘నువ్వు పోస్ట్‌మ్యాన్‌వి మాత్రమే. మోదీ, అమిత్‌ షా నా ముఖం చూడలేకపోతున్నారు ఎందుకు?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే జోషీ.. కాన్పూర్‌ ఓటర్ల పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘బీజేపీ.. నేను కాన్పూర్‌ నుంచి మరోసారి పోటీ చేయవద్దని చెబుతోంది’ అని మాత్రమే ఉన్న ఆ లేఖ బీజేపీ అధిష్టానంపై చేసిన తిరుగుబాటుగానే చూడాల్సి ఉంటుంది. ఆ తరువాత జోషీ పలువురు కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైనప్పుడు వారణాసి నుంచి మోదీ ప్రత్యర్థిగా పోటీచేసే అంశం ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అడ్వాణీ బ్లాగ్‌ను స్వాగతించడం గమనార్హం. సీనియర్‌ నేతలిద్దరికీ టికెట్లు నిరాకరించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. వారిని గౌరవప్రదంగా సాగనంపడంలో మోదీ – షా విఫలమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు