చంద్రబాబు కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ 

29 Apr, 2019 04:21 IST|Sakshi

రాజధానికి భూములివ్వలేదని దౌర్జన్యకాండకు దిగడం దారుణం 

రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది 

వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌ 

విజయవాడ సిటీ/తుళ్లూరు(తాడికొండ): చంద్రబాబు కనుసన్నల్లోనే నేటికీ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. రాజధానికి భూములు ఇవ్వలేదని రైతులపై దాష్టీకాలకు దిగుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయం వెనుక అక్రమంగా నిర్మిస్తున్న రహదారిని రైతు గద్దె మీరా ప్రసాద్‌తో కలిసి సురేష్‌ ఆదివారం పరిశీలించారు. అనంతరం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానవ హక్కులు హరించేలా, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రైతు మీరాప్రసాద్‌పై పోలీసులు, రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు.

సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని, చంద్రబాబులో మానవతా దృక్పథం పూర్తిగా లోపించిందని దుయ్యబట్టారు. రాజధానికి భూమి ఇవ్వని పొలంలో రోడ్డు వేసేందుకు ఏడీసీ అధికారులు యత్నించగా రైతు గద్దె మీరా ప్రసాద్, కుటుంబసభ్యులు అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి ఈడ్చేసి అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం రైతు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడని, ఆయన ప్రాణాలకు ఏదైనా అయితే డీఎస్పీ కేశప్ప, తహసీల్దార్‌ పద్మావతి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. రైతుకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులపై కూడా బెదిరింపులకు దిగడం తగదన్నారు. మే 23 తరువాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారని, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేతిలో అన్యాయాలకు గురైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతు కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయబోతున్నాడని, రైతుకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. 

భూమిని కాపాడుకోవడానికి మూడేళ్లుగా పొలంలోనే నిద్ర : రైతు గద్దె మీరాప్రసాద్‌ 
ల్యాండ్‌ ఫూలింగ్‌ పేరుతో చంద్రబాబు.. తనలాంటి ఎంతో మంది రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని రాజధాని రైతు గద్దె మీరా ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాత పాసు పుస్తకాలు మార్చి తనను రకరకాలుగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. మూడేళ్లుగా తన భూమిని కాపాడుకోవడం కోసం రాత్రిళ్లు చేనులోనే పడుకుంటున్నానని వివరించారు. తహసీల్దార్‌తోపాటు కొందరు అధికారులు లంచాలు తిని రికార్డులు తారుమారు చేసి తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉందని చెప్పినా వినకుండా దౌర్జన్యం చేస్తూ పొలంలో రోడ్డు వేశారని, అడ్డుకున్న తనపై దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.

మరిన్ని వార్తలు