కాంగ్రెస్‌పై మండిపడ్డ మోదీ

22 Mar, 2019 13:49 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు మోదీ. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించర’ని హెచ్చరించారు.

అంతేకాక ‘ఈ దేశ ప్రజలను నేను కోరేది ఒక్కటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను క్షమించబోమని వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే చెప్పండి. జవాన్లకు ఈ దేశం మద్దతుగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. (పాక్‌పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా)

>
మరిన్ని వార్తలు