టీడీపీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం : మోదీ

3 Dec, 2018 19:43 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ

రాహుల్‌ గాంధీకి మతిస్థిమితం లేదు

కుటుంబపాలనలకు చెక్‌ పెట్టాలి

ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి ఆకట్టుకున్న మోదీ.. హైదరాబాద్‌ వస్తే సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారని తెలిపారు. పటేల్‌ వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందన్నారు.

బీజేపీ తరుఫున పోటీ చేసే అభ్యర్థులను పరిచయం చేసిన ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ఈ ఎన్నికలు బీజేపీ ఎన్నికలనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా? వద్దా అని తేల్చుకునే సమయమిది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి కొత్త రాజులు పుట్టుకొస్తున్నారు. వంశపారంపర్యం రాజకీయాలు పెరుగుతున్నాయి. అలాంటి వారికి సవాల్‌ విసిరి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఈ తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన 7 పార్టీలు పోటీలో ఉన్నాయి. వంశపారంపర్య పాలనకు వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి. కొన్ని పార్టీల్లో తండ్రి పోటీ చేస్తున్నారు.. కొడుకు పోటీ చేస్తున్నారు. ఇది అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడవడమే. ఇక్కడ పోటీచేస్తున్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది.

చంద్రబాబు స్వార్థం కోసం..
తెలుగువారి ఆత్మాభిమానం నుంచి టీడీపీ పుట్టింది. కాంగ్రెస్‌పార్టీ అవమానాలు సహించలేక దివంగతనేత ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం కాంగ్రెస్‌తో జతకట్టారు. టీడీపీ కూడా కుటుంబ పార్టీయే, నిర్ణయాలన్నీ ఒక కుటుంబమే తీసుకుంటుంది. టీడీపీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. మజ్లిస్‌ కూడా కుటుంబ పార్టీయే. కాంగ్రెస్‌పార్టీలో ప్రజాస్వామ్యం మిగిలి ఉందా? 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు ఒక కుటుంబానికి పరిమితమైంది. తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌ కోసం ఇక్కడి యువత బలిదానాలు చేసింది. టీఆర్‌ఎస్‌ కూడా కుటుంబ పార్టే.. ఒక కుటుంబం కోసమే యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు? ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఈ కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకండి.

టీఆర్‌ఎస్‌-బీజేపీ బీ టీమ్‌ అని ఆయన మాట్లాడుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్‌, బీజేపీ బీ టీమ్‌ అని ప్రచారం చేశారు. ఫలితాల తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. తెలంగాణలోనూ అదే జరుగుతోంది. డిసెంబర్‌ 7న మీ ఓటుతో వారసత్వ పార్టీలకు చెక్‌ పెట్టాలి. రాహుల్‌ పేరున్న నాయకుడే కానీ.. నిన్న ఏం మాట్లాడాలో.. ఈ రోజుఏం మాట్లాడుతారో తెలియదు. రాహుల్‌కు మతిస్థిమితం లేదు. దేశం కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ,’  అని ప్రజలందరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు