ఐదోసారి సీఎంగా నవీన్‌

27 May, 2019 05:15 IST|Sakshi
గవర్నర్‌ గణేషీలాల్‌కు లేఖ అందిస్తున్న నవీన్‌ పట్నాయక్‌

29న భువనేశ్వర్‌లో ప్రమాణం

ప్రభుత్వ ఏర్పాటుకు ఒడిశా గవర్నర్‌ ఆహ్వానం

23 సీట్లతో ప్రతిపక్షంలోకి బీజేపీ

భువనేశ్వర్‌: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్‌ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ గణేషి లాల్‌ను కలసిన నవీన్‌ పట్నాయక్‌.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు.

అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ గణేషి లాల్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్‌ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్‌ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది.

నిరాడంబర వ్యక్తిత్వం
నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్‌ పట్నాయక్‌ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన  ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్‌ పట్నాయక్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు..

జననం.. విద్యాభ్యాసం..
ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్‌ నేత బిజు పట్నాయక్, గ్యాన్‌ పట్నాయక్‌ దంపతుల కుమారుడైన నవీన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని కటక్‌ ప్రాంతంలో అక్టోబర్‌ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్‌హం బాలుర పాఠశాల, డూన్‌ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్‌ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్‌ స్కూల్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్‌ మూడేళ్ల జూనియర్‌. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్‌ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు.

 

మరిన్ని వార్తలు